కలకలం
నువాపడా ఉప ఎన్నికల్లో..
భువనేశ్వర్: శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికకు ముందు గంజాం జిల్లా నుంచి నువాపడాకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) ట్రక్కును రహస్యంగా రవాణా చేశారనే ఆరోపణలను ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఆర్‌ఎస్ గోపాలన్ సోమవారం తోసిపుచ్చారు. ఈ ఆరోపణ నిరాధారం, అసాధ్యమని, మరే ఇతర జిల్లాల నుంచి ఈవీఎంలను నువాపడాకు తరలించలేదని స్పష్టం చేశారు. నువాపడా ఉప ఎన్నికలో ఉపయోగిస్తున్న అన్ని యంత్రాలను ఆ నియోజక వర్గం కోసం నియమించబడిన స్థానిక గిడ్డంగి నుండి తీసుకున్నారని సీఈఓ గోపాలన్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఈఓ మాట్లాడుతూ నువాపడా గిడ్డంగిలో భద్రపరిచిన ఈవీఎంలను మాత్రమే తరలించారని, ఇతర జిల్లాల్లో భద్రపరిచిన ఈవీఎంలను ఇంకా తాకలేదని, నువాపడా కలెక్టర్ గంజాం నుంచి ఈవీఎంలను తీసుకువచ్చారనే ఆరోపణ పూర్తిగా అబద్ధం అని అన్నారు.
గంజాం జిల్లాలో 2 ఈవీఎం గిడ్డంగులు ఉన్నాయి. వాటిని ఈ నెలలో సీలు చేసి ఉంచారు. సాధారణ తనిఖీకి కూడా తెరవలేదు. ఫిర్యాదు తర్వాత గంజాం జిల్లాలో ఉన్న 2 గిడ్డంగుల సీసీటీవీ ఫుటేజ్‌లను తన కార్యాలయం, ఎన్నికల సంఘం క్షుణ్ణంగా సమీక్షించాయి. ఎలాంటి అవకతవకలు జరగలేదని సీఈఓ పేర్కొన్నారు. వీడియో రికార్డింగ్‌లను స్వయంగా ధ్రువీకరించిన మేరకు గిడ్డంగులు చెక్కుచెదరకుండా ఉన్నాయని తేలింది. ఇక్కడ నుంచి ఈవీఎంలు కదల్లేదని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్త భద్రతకు తనిఖీ నియమావళి
30 జిల్లాల్లోనూ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్నాయి. కట్టుదిట్టమైన నియమావళితో ఈ స్ట్రాంగ్ రూమ్‌లు పర్యవేక్షిస్తారని గోపాలన్ వివరించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి అధికారులు అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీలు నిర్వహిస్తారు. ఈ తనిఖీలను పారదర్శకత కోసం వీడియోగ్రాఫ్ చేస్తారు అని ఆయన అన్నారు. ఈవీఎంల కదలిక, రవాణా ప్రామాణికమైన, గుర్తించదగిన విధానాన్ని అనుసరిస్తుందని సీఈఓ మరింత స్పష్టం చేశారు. ఒక ఈవీఎంను మరమ్మతులు లేదా ఇతరేతర అధీకృత వ్యవహరాల కోసం రవాణా చేసినప్పుడు ఆ మార్గంలో ఉన్న ప్రతి పోలీస్ ఠాణాకు సమాచారం అందజేస్తారు. ట్రాకింగ్ కోసం వాహన వివరాలను అనుబంధ వర్గాలకు ముందస్తుగా తెలియజేస్తారు అని ఆయన పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నుండి అనుమతి లేకుండా ఏ కలెక్టర్ లేదా అధికారి ఈవీఎంలను రవాణా చేయడం సాంకేతికంగా మరియు పరిపాలనాపరంగా అసాధ్యమని సీఈఓ నొక్కి చెప్పారు.
ప్రస్తుతం ప్రతి జిల్లాలో ఈవీఎం గిడ్డంగులను సీసీటీవీ నిఘాలో నిర్వహిస్తున్నారు. ప్రతి గిడ్డంగిలో మునుపటి ఎన్నికల తర్వాత భద్రపరిచిన యంత్రాలు ఉంటాయి. పార్టీ ప్రతినిధుల ఽధ్రువీకరణతో ఎన్నికల సంఘం అనుమతి మేరకు ఉపయోగించగలుగుతారు. ఈవీఎంలపై ఉన్న పేపర్ సీళ్లు, రిజిస్ట్రేషన్ నంబర్లను గిడ్డంగుల్లో భద్రపరిచే ముందు ధృవీకరించడం నియమం. ఒక ఈవీఎం ఉపయోగం కోసం ఆమోదించబడిన తర్వాత దాని వివరాలు అధికారిక రిజిస్టర్‌లో నమోదు చేసి అడ్డకోలు వ్యవహారానికి వీలు లేకుండా పకడ్బందీగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో ఈవీఎంల రవాణా, వినియోగం స్పష్టమైన, పారదర్శక విధానాల ద్వారా నిర్వహించబడతాయి. ఏ యంత్రాన్ని రహస్యంగా తీసుకురావడం లేదా బయటకు తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఈ ఆరోపణలు నిరాధారమైనవి, నిర్ధారిత ఎన్నికల నియమావళికి విరుద్ధం‘ అని సీఈఓ పునరుద్ఘాటించారు.


