విద్యార్థుల ఆందోళన
● కళాశాలకు తాళం వేసిన వైనం
రాయగడ: కళాశాలలో అధ్యాపకుని పనితీరును నిరసిస్తూ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ మేరకు కళాశాల ప్రధాన ద్వారానికి తాళం వేసి బైఠాయించారు. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి కళాశాల ప్రిన్సిపాల్ సకాలంలో విధులకు హాజరు కావడం లేదని విద్యార్థులు ఆరోపించారు. దీంతో అధ్యాపకుడు బాదల్ కుమార్ పరిడ విద్యార్థులపై సక్రమంగా వ్యవహరించడం లేదన్నారు. దీంతో విద్యా బోధనకు, తమ మనోభావాలకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని అన్నారు. అధ్యాపకుని బదిలీ చేయడంతోపాటు ప్రిన్సిపాల్ విధులకు హాజరవ్వాలని వారంతా డిమాండ్ చేశారు. తన మాటను ధిక్కరిస్తే పరీక్షల సమయంలో తక్కువ మార్కులు వేసి తమను ఫెయిల్ చేస్తానని అధ్యాపకుడు తాఖీదు ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ ప్రాణక్రిష్ణ మహాపాత్రో, సమితి విద్యాశాఖ అధికారి (బీజీవో) సుజన మల్లిక్, ఐఐసీ సునిత బెహర, జిల్లా పరిషత్ సభ్యులు తంగుడు శ్రీధర్ తదితరులు కళాశాలకు చేరుకుని విద్యార్థులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు.


