కళా రంగంలో విద్యార్థులు రాణించాలి
● ప్రతిభను కనబరిచేందుకు సరైన వేదిక సురభి
● కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉలక
రాయగడ: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే కార్యక్రమమే సురభి అని కొరాపుట్ లోక్‌సభ ఎంపీ సప్తగిరి ఉలక అన్నారు. స్థానిక బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శిశు మహోత్సవాలను సురభి పేరిట ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. చదవుతో పాటు విద్యార్థులు కళా రంగాల్లో కూడా రాణించాలని అన్నారు. మన రాష్ట్రం కళలకు పుట్టినిళ్లన్నారు. ఎంతో మంది కళాకారులు తమ ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్ర గౌరవాన్ని పెంపోందించారని అన్నారు. ఆదివాసీ, హరిజన ప్రాంతమైన రాయగడ జిల్లా కూడా కళామతల్లిని ఆరాధించే ఎంతోమంది కళాకారులు తమ ప్రతిభను చాటుకుంటున్నారని చెప్పారు. అయితే వారికి సరైన వేదిక లేకపోవడంతోనే వారు ఆయా రంగాల్లో రాణించలేకపొతున్నారని అన్నారు. అయితే సురభి వంటి సాంస్కృతిక కార్యక్రమాలు వారికి ఆశా దీపాలుగా మారుతుండడం అభినందించాల్సిన విషయమని పేర్కొన్నారు. ఇటువంటి తరహా కార్యక్రమాలను సద్వినియోగపరుచుకొని తమ సత్తాను చాటుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన రాయగడ ఎంఎల్‌ఏ అప్పల స్వామి కడ్రక మాట్లాడుతూ.. ప్రయత్నం తొనే విజయాన్ని సాధించవచ్చని అన్నారు. ఒటమి మన విజయానికి సోపానాలుగా మార్చుకోవాలని హితవు పలికారు. నవంబర్ 14వ తేదీన చిల్డ్రన్స్ డే ని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల మధ్య నిర్వహించిన వివిధ పొటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథుల ద్వారా బహుమతులను అందజేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి రామచంద్ర నాహక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అదనపు మేజిస్ట్రేట్ రమేష్ చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కళా రంగంలో విద్యార్థులు రాణించాలి
కళా రంగంలో విద్యార్థులు రాణించాలి


