నేడే నువాపడా ఉప ఎన్నిక పోలింగ్
భువనేశ్వర్: నువాపడా శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికకు అంతా సిద్ధమైంది. మంగళ వారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుంది. నువాపడా ఉప ఎన్నిక పశ్చిమ ఒడిశాలో ప్రధాన రాజకీయ పక్షాలకు బల పరీక్షగా పరిగణిస్తున్నారు. ఈ ఎన్నికలో పరిశీలన, ఉపసంహరణల తర్వాత 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
2,53,624 మంది ఓటర్లు
ఈ ఉప ఎన్నికలో 2,53,624 మంది ఓటర్లు పాల్గొంటారని అధికారిక వర్గాల సమాచారం. వీరిలో 1,29,495 మంది మహిళలు, 1,24,108 మంది పురుషులు ఉన్నారు. మరికొన్ని ప్రదేశాలలో ఓటర్ల జాబితాల తుది సమన్వయం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
పోలింగ్ వేళలు
మంగళ వారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యధిక కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుంది. 47 మారుమూల, మావోయిస్టు ప్రభావిత కేంద్రాల్లో సిబ్బంది, సామగ్రి సురక్షితంగా తరలించడానికి వీలుగా పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముందే ముగుస్తుందని వివరించారు.
358 పోలింగ్ కేంద్రాలు
నువాపడా నియోజక వర్గం వ్యాప్తంగా ఓట్లు వేసేందుకు 358 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 47 సమస్యాత్మక, 8 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న, దుర్గమ ప్రాంతాల్లో పనిచేసే పోలింగ్ పార్టీలకు ప్రత్యేక భద్రతా దళాలు రక్షణ కల్పిస్తాయి. ఈ కార్యకలాపాల కోసం అదనపు సాయుధ సిబ్బందిని నియమించారు. 7 పోలింగ్ కేంద్రాలు సునాబెడా వన్యప్రాణుల అభయారణ్యం లోపల, దగ్గరగా ఉన్నందున భారత ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతితో వైమానిక దళం ఆధ్వర్యంలో స్వతంత్ర హెలికాప్టర్ ద్వారా అధికారులను, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు), ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్) యూనిట్లు మరియు పోలింగ్ సామగ్రిని తరలించారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, భద్రతను పెంచారు.
పోలింగ్ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి వీలుగా 358 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల కమిషన్ వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్ల పరిధిలోకి వస్తాయని అధికారులు తెలిపారు. ప్రతి పోలింగ్ బృందంతో 5 మంది వంతున ప్రభుత్వ సిబ్బంది ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. పోలింగ్ బృందాలు సోమవారం ఉదయం 7 గంటలకు సంబంధిత బూత్‌లకు బయల్దేరారు. ఈ నెల 11న జరగనున్న పోలింగ్ సజావుగా, సురక్షితంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయినట్లు నువాపడా జిల్లా కలెక్టర్ మధుసూదన్ దాస్ తెలిపారు.


