శ్రమదానంతో రోడ్డు నిర్మాణం
● కురుకుటి గ్రామస్తుల ఆదర్శం
రాయగడ: ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తమ గ్రామానికి శ్రమ దానంతో రహదారిని నిర్మించుకుని రాకపోకలకు మార్గం సుగమమం చేసుకున్నారు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి పరిధిలోని సెరిగుమ్మ పంచాయతీ కురుకుటి గ్రామంలో 50 కుటుంబాలకు పైగా నివసిస్తున్నారు. కొండ ప్రాంతం కావడంతో సరైన రోడ్డు లేక అత్యవసర సమయంలో స్థానికులు ఇబ్బందులు పడుతుండేవారు. తమ గ్రామానికి రహదారి నిర్మించండి మహాప్రభో అని రాజకీయ నాయకులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం కనిపించలేదు. దీంతో గ్రామస్తులంతా ఏకమై శ్రమదానానికి పూనుకున్నారు. కాయా కష్టం చేసుకుని జీవనోపాధి పొందే గ్రామస్తులు రెండు రోజులుగా పనులకు వెళ్లకుండా చిన్నాపెద్ద అంతా కలిసి శ్రమదానంతో రహదారిని నిర్మించుకొని ఆదర్శంగా నిలిచారు.


