పరలా వీధి ఘటనలో మరో ఇద్దరు మృతి
పర్లాకిమిడి: పట్టణంలో రెండోవార్డు పరలా వీధిలో బుధవారం శుభాషిష్ పాణిగ్రాహి కుటుంబం విషం తాగి బలవర్మణానికి పాల్పడిన సంఘటన పాఠకులకు తెలిసిందే. అయితే ఈ ఘటనలో పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో కోడుకు బిజయానంద పాణిగ్రాహి (7) మృతి చెందగా, కూతురు ప్రియదర్శిని(11), తండ్రి శుభాషిష్‌లను బరంపురం మెడికల్‌కు తరలించారు. అయితే గురువారం ఉదయం బరంపురం మెడికల్‌లో చికిత్స పొందుతూ కూతురు ప్రియదర్శిని పాణిగ్రాహి (11), తండ్రి శుభాషిష్ కూడా మృతి చెందినట్టు ఆదర్శ పోలీసు స్టేషన్ ఐఐసీ ప్రశాంత భూపతి తెలియజేశారు.
పిడుగులు పడి 9 పశువులు దుర్మరణం
జయపురం: పిడుగులు పడి 9 పశువులు దుర్మరణం పాలయ్యాయి. ఈ సంఘటన చందాహండి సమితి పటఖలియ గ్రామంలో బుధవారం జరిగింది. బుధవారం సాయంత్రం వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో కొంత మంది పశువుల కాపర్లు ఒక చెట్టు వద్దకు చేరుకున్నారు. హఠాత్తుగా పిడుగులు పశువులపై పడ్డాయి. దీంతో ఆవులు, ఎద్దులు, ఆవుదూడలు మరణించినట్లు తెలిసింది. రాజకోట గ్రామం మానసింగ్ గౌఢకు చెందిన రెండు ఎద్దులు, బదలిపాణి గ్రామం అందారు శాంత ఒక ఆవు, ఆవు దూడ, మిశ్ర శాంత పదన శాంతల ఒక్కొక్క ఎద్దు, పాత్ర శాంత ఆవు, ఆవుదూడ, అలాగే రాజేంధ్ర శాంతకు చెందిన ఎద్దు మరణించాయని పటఖలియ గ్రామం పంచాయతీ మాజీ సర్పంచ్ హర పూజాయి వెల్లడించారు.
సైబర్ మోసగాళ్ల అరెస్టు
మల్కన్‌గిరి: జిల్లాలోని బలిమెలలో నివాసం ఉంటున్న సత్యవతి అనే మహిళ సైబర్ మోసానికి గురయ్యారు. కొన్ని రోజుల కిందట ఆమెకు బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి పేరుతో ఓ వ్యక్తి కాల్ చేసి లాటరీలో స్కూటీ గెలిచారని చెప్పారు. మరో ఇద్దరితో కూడా మాట్లాడించి స్కూటీ కోసం రూ.10500 చెల్లించాలని చెప్పారు. దీంతో ఆమె ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించారు. ఆ తర్వాత వారు ఫోన్ ఎత్తకపోవడంతో బాధితురాలు ఏప్రిల్ 24 న బలిమెల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐఐసీ ధీరజ్ పట్నాయిక్ కేసు నమోద్ చేసి దర్యాప్తు చేపట్టారు. నిందతులు జగత్సింగిపూర్ జిల్లా బొరికిన గ్రామానికి చెందిన వారుగా తెలియడంతో అక్కడకు వెళ్లి బుధవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.15వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నిహార్ రంజాన్ సాహు, సుశీల్ మహంతి, నారాయణ సేనాపతిలపై కేసు నమోద్ చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.
ముగిసిన ఉత్సవాలు
రాయగడ: జిల్లాలోని రామనగుడ గ్రామంలో గ్రామ దేవత ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. గత ఐదు రోజులుగా కొనసాగిన ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారి వేషధారణలో ఆదివాసీ మహిళ గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం ప్రత్యేక ఘట్టంగా గుర్తింపు పొందింది. అమ్మవారి ప్రతిరూపమైన ఖండా (కత్తి)ని చేతపట్టుకుని మహిళ ఊరేగింపులో పాల్గొంది. ఈ సమయంలో అమ్మవారి పాదాలు తాకితే ఎటువంటి దుష్టశక్తుల దరిచేరవన్న నమ్మకంతో ఆ ప్రాంత వాసులు, ముఖ్యంగా చిన్నపిల్లలను నడిచే మార్గంలో పడుకోబెట్టారు. వారిని దాటుకుంటూ కత్తి పట్టుకుని మహిళ నడుచుకుంటూ వెళ్లిన ఘటంతో ఉత్సవాలు ముగిశాయి.
పరలా వీధి ఘటనలో మరో ఇద్దరు మృతి
పరలా వీధి ఘటనలో మరో ఇద్దరు మృతి


