బ్యాంకులో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
రాయగడ: బ్యాంకుకు రెండు నెలల పసికందును మోసుకుంటూ వెళ్లిన ఆ మహిళ బ్యాంకు లావాదేవీల్లో ఉండగా అనుకోకుండా తీవ్ర అస్వస్థతకు గురైన ఆ చిన్నారి కన్నుమూసింది. ఈ ఘటన జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. కళ్యాణసింగుపూర్ సమితి పర్శాలి పంచాయతీలోని ఫకేరి గ్రామంలో నివసిస్తున్న డొంగిరియా తెగలకు చెందిన 20 మంది మహిళలు తమ బ్యాంకు ఖాతాలకు సంబంఽధించి లావాదేవీల కోసం కళ్యాణసింగుపూర్‌లో గల ఒక బ్యాంకుకు వెళ్లారు. తమ గ్రామం నుంచి ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపొవడంతో సుమారు 5 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ అంతా కలసి పర్శాలికి చేరుకుని అక్కడి నుంచి ఒక ఆటో సాయంతో కల్యాణసింగుపూర్‌కు బయల్దేరారు. వీరితో పాటు కొనే సికక అనే మహిళ కూడా తన నెండు నెలల పసికందును వెంట తీసుకువెళ్లింది. ఈ క్రమంలో బ్యాంకుకు చేరే సరికి కొద్ది సమయం తర్వాత పసికందు ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. వెంటనే అక్కడ గల ఆస్పత్రికి తరలించగా అప్పటికే పసికందు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కన్నీరు మున్నీరైన ఆమె మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకువెళ్లింది.


