భువనేశ్వర్ : ముందస్తు వ్యూహం ప్రకారం రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖుల ఆధ్వర్యంలో గురువారం శాసన సభ ముట్టడి నిర్వహించింది. ఈ సందర్భంగా స్థానిక రామ మందిరం ఆవరణ నుంచి భారీ ఊరేగింపుతో కాంగ్రెసు భవన్ ప్రాంగణం చేరారు. ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ ప్రముఖులు ఆందోళనకు సంబంధించి భావోద్వేగ ప్రసంగాలు వినిపించారు. అనంతరం శాసన సభ ముట్టడి కోసం మూకుమ్మడిగా తరలివెళ్లారు. దీంతో దిగువ పీఎంజీ కూడలి గురువారం రణరంగంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణతో ఈ పరిస్థితి తాండవించింది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. పోలీసుల చర్యలపట్ల రెచ్చిపోయిన కాంగ్రెసు కార్యకర్తలు కుర్చీలు, గుడ్లు, టమాటాలు, వాటర్ బాటిల్లు రువ్వారు. ప్రతి చర్యగా ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఝులిపించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో వాటర్ స్ప్రే, భాష్ప వాయు ప్రయోగంతో నిరసనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు వ్యక్తులు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. అంతకుముందు నిర్వహించిన సభలో ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు, విద్యార్థులకు భద్రత కల్పించేందుకు కార్యాచరణతో ముందుకు రావాలని, లేకుంటే నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు.


