కాంగ్రెస్ పార్టీకి శంకర్ జిలకర్ర రాజీనామా
రాయగడ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, డీసీసీ మాజీ అధ్యక్షుడు శంకర్ జిలకర్ర ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్యానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామ పత్రాన్ని పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్, డీసీసీ అధ్యక్షుడు, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రకకు సమర్పించారు. కాంగ్రెస్‌లో కీలకపాత్ర పోషిస్తున్న ఆయన రాజీనామా చేయడం పార్టీ వర్గాల్లో కలవర పెడుతున్నాయి. ఆదివాసీ నాయకుడైన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి నిర్విరామంగా కృషి చేశారు. దీంతో జిల్లాలోని రాయగడ, బిసంకటక్, గునుపూర్ అసెంబ్లీ స్థానాలతో పాటు కొరాపుట్ ఎంపీ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థుల విజయం సునాయాసమయ్యిందనే చెప్పొచ్చు. అయితే అసలు పార్టీకి రాజీనామా చేయడం వెనుక కారణం తెలియడం లేదు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన భవిష్యత్‌లో ఏ పార్టీలో చేరుతారో వేచిచూడాల్సిందేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
వృద్ధురాలి మృతి
● మరో ఇద్దరికి గాయాలు
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెగాలిబుడుని గ్రామ సమీపంలోని కూడలిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు దుర్మరణం చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న బిసంకటక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించగా గాయపడిన వారిని బిసంకటక్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. డేగాలిబుడుని గ్రా మానికి చెందిన మహేశ్వర్ కౌసల్య, రామదేవి పాణి, జున్ను కౌసల్య ద్విచక్ర వాహనంపై బిసంకటక్ నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా డెగాలుబుడుని గ్రామానికి దగ్గరలోని కూడలిలో గుణుపూర్ నుంచి వస్తున్న బొలేరో అదుపుతప్పి బైకును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రమాదేవి పాణి (64) సంఘటనా స్థలం వద్దే మృతి చెందగా మహేశ్వర్, జున్నులు గాయాలపాలయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బైకు, బొలేరోను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ మీటర్లకు.. అద్దె వసూలు చట్టవిరుద్ధం
● వినియోగదారుల సంఘం ఆరోపణ
భువనేశ్వర్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులను నిలువునా దోచుకుంటున్నారు. అదనపు సెక్యూరిటీ డిపాజిట్ నోటీసులతో ఇళ్లలో స్మార్ట్ మీటర్లను బలవంతంగా అమర్చుతున్నారు. పేద ప్రజల ఇళ్లలో ప్రభుత్వ మీటర్ల వ్యతిరేకంగా రూ.300 అక్రమంగా వసూలు చేస్తున్నారు. సౌభాగ్య, ఐపీడీఎస్ పథకాలలో మాత్రమే టాటా పవర్ అధీనంలో 4 విద్యుత్ పంపిణీ సంస్థలు 2020 నుంచి చట్ట విరుద్ధంగా మీటర్ల అద్దెను వసూలు చేస్తున్నాయి. ఈ విషయంలో వినియోగదారుల సంఘం ఓఆర్ సీకి పదేపదే ఫిర్యాదు చేసిన ప్రయోజనం శూన్యంగా పరిణమిస్తుంది. టీపీసీఓడీఎల్ సమాచారం ప్రకారం 2024 సంవత్సరం ఏప్రిల్ నుంచి మీటర్ల అద్దె వసూలు చేయడం లేదు. 2024 మార్చి నెల వరకు రూ.18.68 కోట్లు వసూలు చేశారు. ఐపీడీఎస్ మీటర్ల నుండి 2,00,195 మంది వినియోగదారుల నుంచి రూ.11.55 కోట్లు అద్దె వసూలు చేశారు. సౌభాగ్య యోజన కింద 1,75,188 మంది వినియోగదారుల నుంచి మీటర్ అద్దెగా రూ.7.13 కోట్లు వసూలు చేశారు. ఇదిలా ఉండగా టీపీఎన్ ఓడీఎల్, టీపీఎస్ ఓడీఎల్, టీపీ డబ్ల్యూడీఎల్ వంటి 3 కంపెనీలు దీన దయాళ్ యోజన, రాజీవ్ జ్యోతి, బిజూ జ్యోతి వంటి అనేక ప్రభుత్వ పథకాల నుంచి సుమారు రూ. 300 కోట్లు అద్దె రూపంలో దోచుకున్నాయి. ఇంగ్లిషులో బిల్లులు ముద్రించి సాధారణ వినియోగదారుల నుంచి కోట్ల రూపాయలు తీసుకోవడం శిక్షార్హమైన నేరం. వినియోగదారుల సంఘం అధ్యక్షుడు రమేష్ చంద్ర సతపతి, ప్రధాన కార్యదర్శి ప్రసన్న బిషోయ్, కొర్యదర్శులు లలాటేందు దీక్షిత్, అక్షయ్ ఆచార్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మోసపూరితంగా డబ్బు వసూలు చేసినందుకు టాటా అధికారులను అరెస్టు చేసి చట్టం ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలన్నారు. పరిస్థితిని సమీక్షించకుండా రాష్ట్ర ప్రభుత్వం టాటా పవర్‌కు రూ.735 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. పన్ను డబ్బుతో టాటా పవర్ మీటర్లు ఏర్పాటు చేయడం ద్వారా సామాన్య ప్రజలను దోపిడీ చేస్తూనే ఉంటుంది. ఇది విద్యుత్ హక్కు చట్టానికి విరుద్ధమని వినియోగదారుల సంఘం పేర్కొంది.


