తండ్రి మృతదేహానికి కుమార్తె అంత్యక్రియలు
కొరాపుట్: తండ్రి మృతదేహానికి కుమార్తె అంత్యక్రియలు నిర్వహించి కన్నరుణం తీర్చుకుంది. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని రాజు వీధికి చెందిన ప్రముఖ బీజేపీ నాయకుడు గంగాధర్ సామంత్రాయ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు. కొడుకులు లేకపోవడంతో గంగాధర్ సామంత్రాయ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబీకులు ఆలోచనలో పడ్డారు. అయితే చిన్న కుమార్తె స్వాగతిక సామంత్రాయ్ అన్నీతానై తండ్రి అంత్యక్రియలను పూర్తి చేశారు. రాజులు కుటుంబాలతో స్నేహ సంబంధాలు ఉండే సంప్రదాయ ఒడియా బ్రహ్మణ కుటుంబంలో జన్మించిన స్వాగతిక నిర్ణయం కొంత సేపు అందరిని అయోమయానికి గురి చేసింది. అదే సమయంలో కుటుంబ సభ్యులు సైతం మద్దతు ఇవ్వడంతో స్వాగతిక తన తండ్రి చివరి కోరిక నెరవేరుస్తూ చితికి నిప్పంటించింది. ఈ ఘటన పట్ల మహిళల హక్కుల కోసం పోరాడుతున్న మాఘరో మహిళా స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ కాధంబనీ త్రిపాఠి అభినందించారు.
తండ్రి మృతదేహానికి కుమార్తె అంత్యక్రియలు


