పాత శాసనసభ భవనం మన వారసత్వం
భువనేశ్వర్: ప్రస్తుతం ఉన్న ఒడిశా శాసన సభ భవనం భవితవ్యంపై ఉన్న ఊహాగానాలకు న్యాయశాఖ మంత్రి పి.ఆర్.హరిచందన్ ముగింపు పలికారు. ఈ చారిత్రక నిర్మాణాన్ని కూల్చివేయబోమని, బదులుగా వారసత్వ భవనంగా భద్రపరచబడుతుందని, భవిష్యత్తులో మ్యూజియంగా, శాసన మండలి (విధాన పరిషత్)గా ఉపయోగించుకునే అవకాశం ఉందని మంత్రి మంగళవారం స్పష్టంచేశారు. భువనేశ్వర్‌లో అత్యాధునిక శాసనసభ భవనాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత జరుగుతున్న చర్చల మధ్య మంత్రి ప్రకటన వెలువడింది. 70 ఏళ్లకు పైగా పురాతనమైన ప్రస్తుత శాసన సభ భవనం విస్తరణకు అవకాశం లేదు. పెరుగుతున్న శాసన సభ యొక్క భవిష్యత్ అవసరాలను తీర్చలేదని మంత్రి అన్నారు. ఈ భవనం చారిత్రక, నిర్మాణ ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వం దానిని పరిరక్షించాలని నిర్ణయించిందన్నారు. భవిష్యత్తులో ఒడిశాలో శాసన మండలి ఏర్పడితే ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనాన్ని విధాన పరిషత్ భవనంగా ఉపయోగించవచ్చన్నారు. ఇది రాష్ట్ర ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రదర్శించే మ్యూజియంగా కూడా పని చేయగలదన్నారు. ప్రస్తుత లోక్ సేవా భవన్, శాసన సభ భవనం మధ్య ఖాళీగా ఉన్న స్థలంలో కొత్త శాసన సభ భవనం నిర్మితం అవుతుంది. దాదాపు 300 మంది శాసన సభ్యులకు వసతి కల్పించడానికి రూపొందించబడిన ఈ కొత్త సభ భవన సముదాయం తదుపరి శాసన సభ నియోజక వర్గాల పునర్విభజన సమయంలో దాదాపు 50 అసెంబ్లీ స్థానాల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని రూపకల్పన చేసినట్లు మంత్రి వివరించారు. ప్రతిపాదిత నిర్మాణం రెండంతస్తులతో అత్యాధునిక సౌకర్యాలు, భూగర్భ పార్కింగ్, ప్రత్యేక పార్కింగ్ జోన్‌లతో ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.387.94 కోట్లు ఖర్చవుతుందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రకటించారు. ప్రస్తుతం పని చేస్తున్న విభాగాధిపతుల 9 అంతస్తుల భవన సముదాయం, ప్రస్తుత లోక్ సేవా భవన్‌కు దగ్గరగా ఉన్న రాజీవ్ భవనాల కాల పరిమితి ముగిసి సురక్షితం కాదని ప్రకటించబడినందున వాటిని కూల్చివేస్తామని హరిచందన్ తెలియజేశారు. దాదాపు 67 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రస్తుత లోక్ సేవా భవన్ (సచివాలయం) తీవ్రమైన స్థల పరిమితుల కారణంగా వేరే చోటికి మార్చబడుతుంది. కొత్త సచివాలయ సముదాయాన్ని 3 దశల్లో నిర్మించనున్నారు. మొదటి దశలో ఖారవేళ భవన్ సమీపంలో ప్రధాన లోక్ సేవా భవన్, రెండవ దశలో పవర్ హౌస్ స్క్వేర్ సమీపంలో అదనపు సచివాలయ కార్యాలయాలు, ఏడీఎం కార్యాలయం మరియు ఒసేపా క్యాంపస్‌కు ఆనుకొని కొత్త శాసన సభ, లోక్ సేవా భవన్ సముదాయం మరియు ఇతర ప్రభుత్వ భవనాలను 71.13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. మూడో దిశలో ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాంపస్‌ను ఏర్పరుస్తారు. న్యూఢిల్లీ సెంట్రల్ విస్టా పునరాభివద్ధి నుండి ప్రేరణ పొందిన ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ. 3,623 కోట్లు ఖర్చవుతుంది. ఒడిశా పరిపాలనా, శాసన మౌలిక సదుపాయాలను రానున్న 70 నుంచి 100 సంవత్సరాలకు అనుగుణంగా నూతన శాసన సభ భవన సముదాయం ప్రతిష్టాత్మక కట్టడంగా నిలుస్తుందన్నారు.
మంత్రి హరిచందన్


