రాయగడ: ఏనుగుల దాడిలో ఒక మహిళ గాయపడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి పర్శాలి పంచాయతీ తోట గ్రామానికి చెందిన నసితి బెడక అనే మహిళ తన పొలం పనులను ముగించుకుని ఇంటికి అటవీ ప్రాంతంలో నడిచి వస్తున్న సమయంలో ఒక ఏనుగుల గుంపు తారసపడింది. దీంతో భయాందోళనతో ఆమె పరుగులు తీయగా గుంపులోని ఒక ఏనుగు ఆమైపె దాడి చేసింది. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. ఏనుగుల దాడిలో గాయపడిన నసితి బెడకను, ఏనుగుల గుంపు ఉన్న ప్రాంతం నుంచి అటవీ శాఖ అధికారులు అతికష్టం మీద తరలించి కల్యాణ సింగుపూర్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆమె ప్రాణాలకు ఎటువంటి భయం లేదని వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఏనుగుల దాడులు పెరుగుతుండడంతో స్థానికులకు కంటిమీద కునుకు ఉండడం లేదు.
రూ.10 కోట్ల వితరణ
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాల అభివృద్ధికి నవరత్న కంపెనీల్లో ఒకటైన భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో) రూ.10 కోట్ల వితరణ చేసింది. గురువారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ వి.కీర్తివాసన్‌తో నాల్కో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. సంస్థ లాభాల్లో వచ్చిన మొత్తంలో రూ.10 కోట్ల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు.
నకిలీ డాక్టర్ అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీసులు గురువారం ఓ నకిలీ వైద్యుడిని అరెస్టు చేశారు. కొన్ని రోజులుగా ఓ నకిలీ వైద్యుడు చిత్రకొండ సమితిలో పాత చమటపల్లి, నీలాకాంబేరు పంచాయతీ పరిధిలోని కొన్ని గ్రామాల్లో వైద్యం చేస్తున్నాడు. ఆయనపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న చిత్రకొండ ఎస్‌డీపీఓ ప్రదోష్ ప్రధాన్ వైద్యుడిపై దర్యాప్తు చేసి వివరాలు సేకరించారు. ఈ నకిలీ వైద్యుడి పేరు విద్యాధర్ హాల్దార్ (38). ఈయన స్వగ్రామం పాత చిమటపల్లి పంచాయితీ యంవి 120 గ్రామం. 2012 నుంచి 2017 వరకు మల్కన్‌గిరిలో ఓ మెడికాల్ స్టోర్‌లో పనిచేసి తనకు తెలిసిన విద్యతో ఇలా డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు. తాను ఫార్మసీ చదివానని అతను చెబుతున్నా.. కేవలం 8వ తరగతి మాత్రమే చదివాడని పోలీసులు తెలిపారు. అతడి నుంచి మందులు స్వాధీనం చేసుకున్నారు.
నేటి నుంచి ఒంటి పూట బడులు
భువనేశ్వర్: రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతోంది. వేసవి తాపం నేపథ్యంలో పాఠశాలలు, విద్యా సంస్థల్లో తరగతుల వేళల్ని సవరించారు. రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలవుతాయి. విభాగం ఆధీనంలో పని చేస్తున్న విద్యా సంస్థలు అన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని విభాగం స్పష్టం చేసింది. వేసవి తాపం నేపథ్యంలో విద్యా సంస్థల్లో చేపట్టాల్సిన జాగ్రత్తల మార్గదర్శకాల్ని విభాగం జారీ చేసింది.
●1 నుంచి 12వ తరగతి వరకు నిత్యం ఉదయం 6.30 గంటల నుంచి 10.30 గంటల వరకు తరగతుల నిర్వహణ వేళలు.
● విద్యార్థులకు పుష్కలంగా తాగునీటి సౌకర్యాలు అందుబాటులో ఉండాలి.
● విద్యాసంస్థల ప్రాంగణాల్లో మొరాయిస్తున్న గొట్టపు బావులు ఇతరేతర తాగు నీటి వనరుల పునరుద్ధరణ కార్యకలాపాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి పునరుద్ధరించాలి.
● అవసరమైతే విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సరఫరా చేయడం అనివార్యం.
ఏనుగుల దాడిలో మహిళకు గాయాలు