తెర్లాం: గంజాయితో పట్టుబడిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లు తెర్లాం ఎస్సై ఆర్.రమేష్ మంగళవారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెర్లాం, మెరకముడిదాం మండలాల్లోని రంగప్పవలస, పులిగుమ్మి, రామయ్యవలస గ్రామాలకు చెందిన ముగ్గురు యువకులు 1.5కిలోల గంజాయి తీసుకుని వస్తుండగా తెర్లాం జంక్షన్ వద్ద పట్టుకుని అరెస్ట్ చేశామని చెప్పారు. వారంతా ఒడిశా రాష్ట్రంలోని సుంకి ప్రాంతం నుంచి గంజాయి తీసుకువచ్చి వారు వినియోగించడమే కాకుండా, మండలంలోని పలు గ్రామాలకు చెందిన మరికొంత మంది యువతకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. దీనిపై నిఘా ఉంచి మంగళవారం ఉదయం ముగ్గురు యువకులు గంజాయి తెస్తుండగా తెర్లాం జంక్షన్ మాటు వేసి పట్టుకున్నామ న్నారు. నిందితుల వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం బొబ్బిలి కోర్టుకు తరలించామని తెలిపారు. ఈ కేసును బొబ్బిలి రూరల్ సీఐ తిరుమలరావు దర్యాప్తు చేస్తున్నారని ఎస్సై తెలియజేశారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి తెర్లాం, గరివిడి మండలాలకు చెందిన ఆరుగురు యువకులు గంజాయి తరలిస్తుండగా తెర్లాం ఎస్సై రమేష్ వారిని పట్టుకుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రెండురోజుల్లో గంజాయితో తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.