పెళ్లింట విషాదం: ట్రాక్టర్‌లో వివాహానికి.. అదుపు తప్పిన వాహనం.. 30 అడుగుల లోయలో పడటంతో..

చిత్రకొండ ఆరోగ్య కేంద్రం వద్ద బాధిత కుటుంబ సభ్యులు  - Sakshi

మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి బోడపుట్‌ ఘాటీలో ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా, 10 మందికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బోడపొదర్‌ పంచాయతీకి చెందిన 15మంది గాజులమమ్ముడి పంచాయతీ తంట్లగూడ గ్రామంలో జరుగుతున్న వివాహానికి బుధవారం ఉదయం ట్రాక్టర్‌పై వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తున్న సమయంలో ఖరిమాల్‌ సమీపం బోడపుట్‌ ఘాటీలో వాహనం అదుపు తప్పి, 30అడుగుల లోయలోకి బోల్తా పడింది.

పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే అక్కడికి చేరుకొని, లోయలో పడి ఉన్న వారిని బయటకు తీశారు. పలువురు తీవ్రంగా గాయపడగా చిత్రకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే సమయానికి ఓ వ్యక్తి మృతిచెందారు. గురువారం ఉదయం 9గంటల సమయంలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి సహా ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు.

మరో 10 మందిచి గాయాలుకాగా, ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న చిత్రకొండ ఎమ్మెల్యే పూర్ణచంద్ర బక్క ఆరోగ్య కేంద్రానికి చేరుకొని, క్షతగాత్రులు, బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందిచేందుకు తనవంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.

మరోవైపు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఘటనపై చిత్రకొండ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top