అవస్థల కౌంటింగ్‌ ! | - | Sakshi
Sakshi News home page

అవస్థల కౌంటింగ్‌ !

Nov 4 2026 2:20 AM | Updated on Nov 4 2026 2:20 AM

అవస్థల కౌంటింగ్‌ ! ఎన్టీఆర్‌ జిల్లా అధికారుల దారుణ వైఫల్యం

కనిపించని స్ట్రాంగ్‌రూం తాళాలు..

ఎన్టీఆర్‌ జిల్లా అధికారుల దారుణ వైఫల్యం

● వర్షం వస్తుందని తెలిసినా ఏర్పాట్లు లేవు

● అధికారుల మధ్య సమన్వయ లోపం

● సాయంత్రం నాలుగు గంటల

వరకూ ప్రారంభం కాని కౌంటింగ్‌

సాక్షి ప్రతినిధి, విజయవాడ/పటమట: మునిసిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ విషయంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. మురసు తుపాను కారణంగా వర్షం వస్తుందని తెలిసి, అర్ధరాత్రి వరకూ సమీక్షలు నిర్వహించిన అధికారులకు.. ఎన్నికల కౌంటింగ్‌ జరిగే కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తిగా గాలికి వదిలేశారు. దీంతో కౌంటింగ్‌ సిబ్బందికి, కౌంటింగ్‌ ఏజెంట్లకు చుక్కలు కనపడ్డాయి. కౌంటింగ్‌ విధులు నిర్వర్తించే సిబ్బందికి, ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ చేసే కార్మికులకు రిపోర్టింగ్‌ కేంద్రం, మీడియా సెంటర్‌ కూడా ఒకటే ఏర్పాటు చేయటంతో ప్రాంగణమంతా గందరగోళ వాతావరణం నెలకొంది. లెక్కింపు విధులు నిర్వహించే పోలీస్‌, రెవెన్యూ, మునిసిపల్‌ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడమే దీనికి కారణమనే విమర్శలున్నాయి.

విజయవాడలో 8 గంటలు ఆలస్యంగా..

ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌కు హాజరయ్యే సిబ్బంది ఉదయం 6 గంటలకు రిపోర్టు చేయాలని వీఎంసీ కమిషనర్‌ ధ్యానచంద్ర ఆదేశించినప్పటికీ వర్షం కారణంగా సిబ్బంది రెండుగంటలు ఆలస్యంగా చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న వారు రిపోర్టింగ్‌ చేయడానికి కనీస వసతులు కల్పించలేకపోవటంతో వారికి కేటాయించిన డివిజన్‌ కౌంటింగ్‌ టేబుల్‌ వద్దకు మధ్యాహ్నం 12గంటల వరకు సిబ్బంది రిపోర్టింగ్‌ చేస్తూనే ఉన్నారు. అనంతరం వారికి కేటాయించిన నియోజకవర్గం, డివిజన్‌, టేబుల్‌కు చేరుకునే సరికి మధ్నాహ్నం రెండు గంటలయ్యింది. ఆ తర్వాత భోజన విరామం రావడంతో వారంతా భోజనం చేసిన తర్వాత తీరిగ్గా కౌంటింగ్‌ ప్రారంభించారు.

అంతా అస్తవ్యస్తం..

మేయర్‌ అభ్యర్థులకు, 86 డివిజన్ల కార్పొరేటర్‌ అభ్యర్థులకు కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయటంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. తూర్పు నియోజకవర్గంలోని 2–30 డివిజన్లకు లయోలా కళాశాల దేవయ్య ఆడిటోరియంలో, సెంట్రల్‌ నియోజకవర్గంలోని 1, 59–86 డివిజన్లకు డిగ్రీ కళాశాల ప్రాంగణంలో, పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 31 నుంచి 58 డివిజన్లకు ఇంటర్మీడియెట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేయటం అసలు గందరగోళానికి కారణంగా మారింది. అక్కడికి బ్యాలెట్‌ బాక్సులు ఉన్న కంటైనర్లను పంపడం ఒక ప్రహసనంగా మారింది.

అసలు తప్పు ఎక్కడ జరిగింది?

కౌంటింగ్‌ కేంద్రం ఎంపికే తప్పని, నగరం నడిబొడ్డున, అన్ని వసతులు ఉన్న అంబేడ్కర్‌ ఆడిటోరియంను కాదని, శివారులో ఉన్న లయోలా కళాశాలను ఎందుకు ఎంపిక చేశారన్న ప్రశ్న తలెత్తుతోంది. లక్షలు ఖర్చు చేసి పెద్ద ఎత్తున షామియానాలు ఏర్పాటు చేసినా తుపాను వల్ల పడిన కుండపోత వర్షం వల్ల ఫలితం శూన్యంలా మారింది. వర్షం కారణంగా మోకాలు లోతు నీళ్లలో కౌంటింగ్‌ కేంద్రాలకు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.

వరద బాధితుల్లా..

కౌంటింగ్‌ కేంద్రాల్లో పనిచేసేందుకు తీసుకువచ్చిన హమాలి కార్మికులను కనీసం పట్టించుకోలేదు. వారికి టిఫిన్‌ కూడా ఏర్పాటు చేయలేదు. గత రాత్రి పనికి వచ్చామని, ఎవరు పట్టించుకోవట్లేదంటూ హమాలి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. బుడమేరు వరదల సమయంలో బాధితులు ఆహారపొట్లాల కోసం ఎలా ఎగబడ్డారో సిబ్బంది కూడా అలానే ఎగబడాల్సిన దుస్థితి అక్కడ కనిపించింది.

కొండపల్లిలోనూ గందరగోళం..

కొండపల్లి కౌంటింగ్‌ హాల్‌, స్ట్రాంగ్‌ రూమ్‌ ఉన్న ప్రాంతంలో రాత్రి వేళ కొందరు వ్యక్తులు సంచరించడాన్ని గమనించిన వైఎస్సార్‌ సీపీ నాయకులు బ్యాలెట్‌ బాక్సులను మారుస్తున్నారేమోనన్న సందేహంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేంద్రానికి చేరుకుని, కౌంటింగ్‌ కేంద్రంలో కూలర్‌లు బిగించే పనులు జరుగుతున్నట్లు గుర్తించారు.

జగ్గయ్యపేటలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉండగా తుపాను ప్రభావంతో భారీ వర్షం కురుస్తుండటంతో గంట ఆలస్యంగా కౌంటింగ్‌ నిర్వహించారు. జోరు వర్షంలోనే ఎన్నికల సిబ్బంది, కౌంటింగ్‌ ఏజెంట్లు కౌంటింగ్‌ హాల్‌ వద్దకు వచ్చారు. వారి పాస్‌లను తీసుకోవడంలో ఎన్నికల అధికా రులు కొంత జాప్యం చేయడంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం ఎన్నికల అదికారి జోక్యంతో కౌంటింగ్‌ ప్రారంభించారు. స్ట్రాంగ్‌ రూము తాళాలు ఎన్నికల అధికారి, సిబ్బంది ఎక్కడో పడవేయడంతో పోలీసులు, ఎన్నికల అధికారులు, ఇరు పార్టీల అభ్యర్థుల సమక్షంలో తాళాలను పగులగొట్టి స్ట్రాంగ్‌ రూమును ఓపెన్‌ చేయాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement