చురుగ్గా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ | - | Sakshi
Sakshi News home page

చురుగ్గా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ

Nov 4 2026 2:20 AM | Updated on Nov 4 2026 2:20 AM

చురుగ్గా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ

ఏపీ సీపీడీసీఎల్‌ సీఎండీ పుల్లారెడ్డి

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మురసు తుపాను ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్‌ సరఫరా పునరుద్ధణ పనులను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ సీపీడీసీఎల్‌) సీఎండీ పి.పుల్లారెడ్డి తెలిపారు. నగరంలోని సంస్థ కార్పొరేట్‌ కార్యాలయంలో తుపాను ప్రభావంపై ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. పుల్లారెడ్డి మాట్లాడుతూ.. తుపాను ప్రభావంతో ఏపీ సీపీడీసీఎల్‌ పరిధిలోని పలు జిల్లాల్లో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదన్నారు. ముఖ్యంగా ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ లైన్లు, సబ్‌స్టేషన్లు, విద్యుత్‌ మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. 2,750 విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిన్నాయని, వాటిలో 33 కేవీ పరి ధిలో 270, 11 కేవీ పరిధిలో 1,530, ఎల్‌టీ పరిధిలో 950 విద్యుత్‌ స్తంభాలు ఉన్నాయని వివరించారు.

1,367 గ్రామాలకు నిలిచిన సరఫరా

తుపాను కారణంగా సర్కిల్‌ పరిధిలో 1,367 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని పుల్లారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 597 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించామని, 770 గ్రామాలకు పునరుద్ధరించాల్సి ఉందని పేర్కొన్నారు. బాపట్ల, ప్రకాశం జిల్లాలతో పాటు మంగళవారం మధ్యాహ్నం నుంచి చిలకలూరిపేటలో కూడా బలమైన గాలులు, వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగిందన్నారు. ఈ ప్రాంతంలో 33/11 కేవీ పరిధిలోని 32 సబ్‌స్టేషన్లలో సమస్యలు తలెత్తగా, 13 సబ్‌స్టేషన్లను తిరిగి అందు బాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. మరో 19 సబ్‌స్టేషన్ల పరిధిలో వర్షం కొనసాగుతుండటంతో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 1,500 మంది విద్యుత్‌ సిబ్బందితో నిరంతరం విధులు నిర్వహిస్తూ పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తున్నామని పుల్లారెడ్డి చెప్పారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కాని గ్రామాలకు వీలైనంత త్వరగా విద్యుత్‌ సరఫరా అందించాలని అధికారులను పుల్లారెడ్డి ఆదేశించారు. పునరుద్ధరణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా అవసరమైన సిబ్బంది, సామగ్రిని సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని చెప్పారు. ప్రజలు విద్యుత్‌ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెగిపడిన విద్యుత్‌ వైర్లు, నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదని, వాటికి దూరంగా ఉండా లని పుల్లారెడ్డి సూచించారు. విద్యుత్‌ ప్రమాదాలు, విద్యుత్‌ సరఫరా అంతరాయాలకు సంబంధించిన సమాచారాన్ని టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912కు తెలియజేయాల్సిందిగా ఆయన కోరారు. ఏపీసీపీడీసీఎల్‌ డైరెక్టర్‌ టెక్నికల్‌ మురళీకృష్ణ యాదవ్‌ పాల్గొన్నారు.

విజయవాడలో పునరుద్ధరణ పనులు

తుపాను ప్రభావం వల్ల వీచిన గాలులకు విజయవాడ నగరంలోని కొత్తపేట సెక్షన్‌ పరిధిలో, బాలాజీ నగర్‌ కొత్త ఆంజనేయ స్వామి ఆలయం సమీ పంలో, భవానీ పురంలో టీచర్స్‌ కాలనీలో విద్యుత్‌ తీగలపై చెట్లు పడటంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వెంటనే సిబ్బంది స్పందించి చెట్లను తొలగించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement