తేలనున్న అభ్యర్థుల భవితవ్యం | - | Sakshi
Sakshi News home page

తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

Nov 3 2026 2:21 AM | Updated on Nov 3 2026 2:21 AM

తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

నేటి ఉదయం 8 గంటల నుంచి ‘మున్సిపల్‌’ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదట పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు 10 గంటల నుంచి ఫలితాలు విజయవాడ 15వ డివిజన్‌లో తొలిఫలితం

లయోల కళాశాలలో..

సాక్షి ప్రతినిఽధి, విజయవాడ: మున్సిపోల్స్‌లో అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. జిల్లాలో జరిగిన విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు జగ్గయ్యపేట, నందిగామ, కొండ పల్లి, తిరువూరు మున్సిపాలిటీల్లో పోలైన ఓట్లను మంగళవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కించనున్నారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత డివిజన్లు, వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఒక డివిజన్‌కు ఎన్ని పోలింగ్‌ కేంద్రాలున్నా వాటిలోని ఓట్లను కలిపి 25 చొప్పున కట్టలు కడతారు. వాటిని గుర్తుల వారీగా విభజించి ఏ గుర్తుకు ఎన్ని ఓట్లు పోలయ్యాయో లెక్కిస్తారు. ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను విజేతగా ప్రకటిస్తారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, సభలను నిషేధించారు.

ప్రతి వార్డుకు 10 టేబుళ్లు

ప్రతి వార్డుకు మొత్తం 10 కౌంటింగ్‌ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఐదు టేబుళ్లపై వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, మరో ఐదు టేబుళ్లపై మేయర్‌ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో వార్డు ఫలితాన్ని ప్రకటించేందుకు రెండు రౌండ్ల కౌంటింగ్‌ ప్రక్రియ అవసరమవు తుంది. మొదటి రెండు రౌండ్లలో 44 వార్డులకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం తదుపరి రెండు రౌండ్లలో మిగిలిన వార్డుల ఫలితాలను ప్రకటించనున్నారు. విజయవాడ 15వ డివిజన్‌లో 8644 ఓట్లకు 3345 ఓట్లు మాత్రమే పోల్‌ అయ్యాయి. అతి తక్కువ ఓట్లు పోల్‌ కావడంతో ఈ ఫలితం ముందుగా వచ్చే అవకాశం ఉంది.

తిరువూరు వాహినీ ఇంజినీరింగ్‌ కాలేజీలో

తిరువూరులో శ్రీవాహినీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 28 వార్డుల్లో చైర్మన్‌ పదవికి పోలైన ఓట్ల లెక్కింపునకు 7 టేబుళ్లు, వార్డు కౌన్సిలర్ల ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. చైర్మన్‌ ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లలో, కౌన్సిలర్ల ఓట్ల లెక్కింపు రెండు రౌండ్లలో పూర్తి కానుంది. కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 40 వార్డులకు జెడ్పీ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన వంట షెడ్డులో లెక్కింపు చేయనున్నారు. 20 వార్డులు ఒక రౌండ్‌, మరో 20 వార్డులు రెండో రౌండ్‌లో కౌంటింగ్‌ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. జగ్గయ్యపేటలో మొత్తం 36 వార్డులకు 12 వార్డులు ఏకగ్రీవంగా కాగా, మిగిలిన 24 వార్డులకు సంబంధించి 72 పోలింగ్‌ బూత్‌ల కోసం 24 టేబుళ్లను ఏర్పాటు చేశారు.

రెండు రౌండ్‌లలో అన్ని వార్డుల ఫలితాలు వెలువడతాయి. చైర్‌పర్సన్‌ లెక్కింపు మొదటి రౌండ్‌లో 24 వార్డులు, తర్వాత రౌండ్‌లో 12 వార్డులు లెక్కిస్తారు. నందిగామలోని 32 వార్డులకు.. వార్డు సభ్యుల లెక్కింపునకు 16 టేబుళ్లు, చైర్మన్‌ అభ్యర్థుల ఓట్ల లెక్కింపుకు ఆరు టేబుళ్లు ఏర్పాటు చేశారు. రెండు రౌండ్లలో ఫలితాలు తేలనున్నాయి.

విజయవాడ మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు ఆంధ్ర లయోల కళాశాలలో జరగనుంది. కౌంటింగ్‌ ప్రక్రియ వేగవంతంగా నిర్వహించేందుకు తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా మూడు కౌంటింగ్‌ హాళ్లను ఏర్పాటు చేశారు. తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన వార్డుల ఓట్ల లెక్కింపు ఇండోర్‌ స్టేడియంలో, ‘పశ్చిమ’ వార్డుల ఓట్ల లెక్కింపు ఇంటర్మీడియెట్‌ బ్లాక్‌లో, ‘సెంట్రల్‌’ వార్డుల ఓట్ల లెక్కింపు ఇంటర్మీడియెట్‌ బ్లాక్‌కు ఎదురుగా ఉన్న మరో బ్లాక్‌లో నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement