న్యాయవాదులకు ఏకాగ్రత, క్రమశిక్షణ అవసరం | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదులకు ఏకాగ్రత, క్రమశిక్షణ అవసరం

Nov 3 2026 2:21 AM | Updated on Nov 3 2026 2:21 AM

న్యాయవాదులకు ఏకాగ్రత, క్రమశిక్షణ అవసరం సాఫ్ట్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి వైశాలికి సత్కారం నేడు ఎన్టీఆర్‌ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు సహజ వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

విజయవాడ లీగల్‌/పెనమలూరు: జ్యుడీషియల్‌ సర్వీసెస్‌లో ప్రవేశించాలంటే ఏకాగ్రత, స్వీయ ఆలోచనా శక్తి ఎంతో అవసరమని హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ అన్నారు. ఎస్‌వీడీ సిద్ధార్థ స్కూల్‌ ఆఫ్‌ లా, ఏపీ లా అకాడమీ సంయుక్తంగా జూనియర్‌ న్యాయవాదులకు ‘న్యాయసేవలోకి ప్రవేశించడం ఎలా’ అనే అంశంపై సోమవారం పెనమలూరు మండలం కానూరులోని సిద్ధార్థ లా కళాశాలలో ప్రత్యేక సదస్సు నిర్వహించాయి. జస్టిస్‌ కృపాసాగర్‌ మాట్లాడుతూ గతంలో విద్యార్థుల్లో స్వతంత్రంగా ఆలోచించే శక్తి, విషయ పరిజ్ఞానాన్ని గుర్తుంచుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండేవని, ప్రస్తుతం ప్రతి చిన్న విషయానికీ సెల్‌ఫోన్లపై ఆధారపడే ధోరణి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష హాల్లో సెల్‌ఫోన్లకు అనుమతి ఉండదు కనుక విద్యార్థులు తమ జ్ఞాపకశక్తి, స్వీయ ఆలోచనా సామర్థ్యం, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, అప్పుడే పరీక్షల్లోనూ జీవితంలోనూ విజయం సాధించగలరని హితవు పలికారు. అకాడమీ అధ్యక్షుడు ఏకే బాషా, కార్యదర్శి కోనేరు సీతారామయ్య, కాలేజీ డీన్‌ సీహెచ్‌ దివాకర్‌బాబు, ఆల్‌ ఇండియా బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు కె.చిదంబరం, ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు చలసాని అజయ్‌కుమార్‌ తదితరులు మాట్లాడారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): గత నెల 26 నుంచి 31వ తేదీ వరకు చైనాలోని జింగ్‌షాన్‌లో జరిగిన ప్రపంచ జూనియర్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌– 2026లో పాల్గొని డబుల్స్‌ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన నగరానికి చెందిన క్రీడాకారిణి ఏఎస్‌ వైశాలిని ఎన్టీఆర్‌ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీవో) కె.కోటేశ్వరరావు అభినందించారు. ఎంజీ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం ఆవరణలో ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) కార్యాలయంలో వైశాలిని సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ వైశాలి సాధించిన విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తి దాయకమని, భవిష్యత్‌లో మరిన్ని విజయాలను వైశాలి సాధించాలని ఆకాంక్షించారు. శాప్‌ సిబ్బంది, కోచ్‌లు పాల్గొన్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): మురసు తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 3వ తేదీ మంగళవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ నెల 3వ తేదీ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పర్యావరణ పరిరక్షణతో పాటు సహజ వనరుల సమర్థ వినియోగం కోసం ప్రతి ఒక్కరూ సుస్థిర జీవనశైలి అలవర్చుకోవాలని ఏపీ సీపీడీసీఎల్‌ సీఎండీ పి. పుల్లారెడ్డి చెప్పారు. స్థానిక ఏపీసీపీడీసీఎల్‌ కార్పోరేట్‌ కార్యాలయంలో బ్రిక్స్‌ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా ప్రచార కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ వరకు సర్కిల్‌ పరిధిలో పర్యావరణహిత జీవనశైలి, విద్యుత్‌ పొదుపు, నీటి సంరక్షణ, ప్లాస్టిక్‌ వినియోగం తగ్గింపు అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంధన సామర్థ్యం కలిగిన విద్యుత్‌ పరికరాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయవచ్చని చెప్పారు. ఏపీసీపీడీసీఎల్‌ టెక్నికల్‌ డెరెక్టర్‌ మురళీకృష్ణ యాదవ్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, సీజీఎంలు, జీఎం, ఉద్యోగులు హాజరై పర్యావరణహితంగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement