మురసు ముప్పు | - | Sakshi
Sakshi News home page

మురసు ముప్పు

Nov 3 2026 2:21 AM | Updated on Nov 3 2026 2:21 AM

భారీ వర్షాలకు అవకాశం అప్రమత్తమైన అధికారులు బుడమేరు పరీవాహక ప్రాంతంలో కలెక్టర్‌ లక్ష్మీశ పర్యటన

సమాచారం అందించండి

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణావాసులకు ‘మురసు’ ముప్పు ఎదురవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా మారి తీరప్రాంతానికి ‘మురసు’గా దగ్గరవుతున్న తరుణంలో ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో రాబోయే 24 నుంచి 48 గంటల్లో ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు. ఒకవైపు మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌, మరోవైపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అన్ని విధాల సన్నద్ధం అవుతోంది.

జిల్లాపై ప్రభావం

సోమవారం అర్ధరాత్రి తర్వాత తుపాను ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలపడంతో ఆ ప్రభావం జిల్లాపై పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. నీరు నిల్వ ఉండకుండా వెంటనే మోటార్ల ద్వారా తొలగించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్‌ పునరుద్ధరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండలంలో ఎంపీడీవో, తహసీల్దార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

యంత్రాంగం అప్రమత్తం

రాష్ట్రంలో ముంచుకొస్తున్న ‘మురసు’ తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. బుడమేరు క్యాచ్‌మెంట్‌ ఏరియాలో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ నివేదికల దృష్ట్యా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ సోమవారం సాయంత్రం బుడమేరు పరీవాహక ప్రాంతంలోని గూడవల్లి, ఎనికేపాడు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా బుడమేరు ప్రవాహ తీరును, గట్లను, క్షేత్రస్థాయి పరిస్థితులను కలెక్టర్‌ నిశితంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో నీటిపారుదల, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. బలహీనంగా ఉన్న కరకట్టల వద్ద ఇసుక బస్తాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. తుఫాన్‌ ప్రభావం తగ్గేంతవరకు బుడమేరు లోతట్టు, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికార యంత్రాంగం రౌండ్‌ ది క్లాక్‌ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఎగసి పడుతున్న అలలు

కోడూరు మండలం పాలకాయ తిప్పవద్ద అలలు ఎగసిపడుతున్నాయి. బందరు తీరం వద్ద అలల ఉధృతి అధికంగానే ఉంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో పాలకాయతిప్ప సింక్‌కు బోట్లు చేరుకున్నాయి.

ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే గమనించాలని, సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులు, అపోహలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఏదైనా అత్యవసర సమాచారం ఉంటే కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 91549 70454 కు సమాచారం అందించాలని తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నగర పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖరబాబు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. తుఫాను అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని అన్ని పోలీస్‌ స్టేషన్లు, ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement