అన్ని సర్కిళ్లు, డివిజన్లలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకుముందస్తు చర్యలు ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి
కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మురసు తుపాను ప్రభావంతో బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సిబ్బంది పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీ సీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి తమ శాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మురసు తుపాను నేపథ్యంలో సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సర్కిల్ పరిధిలోని జిల్లాల విద్యుత్ అధికారులతో ఆయన సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ.. తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో ఉండాలన్నారు. భారీ వర్షాలు, బలమైన గాలుల వల్ల విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు దెబ్బతినే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.
సాధ్యమైనంత త్వరగా సరఫరా పునరుద్ధరణ
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన సంద ర్భాల్లో సాధ్యమైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించేందుకు అవసరమైన సిబ్బంది, వాహనాలు, మరమ్మతు పరికరాలు, విద్యుత్ సామగ్రిని సిద్ధంగా ఉంచాలని పుల్లారెడ్డి సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. తుపాను పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఏపీ సీపీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిల్, డివిజన్ స్థాయిలలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గి, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు విద్యుత్ ఉద్యోగులు సెలవులు తీసుకోవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టేలా సిబ్బంది అన్ని వేళలా సిద్ధంగా ఉండాలని కోరారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, తెగిపడిన విద్యుత్ వైర్లు, స్తంభాలను తాకవద్దని పేర్కొన్నారు. విద్యుత్‌కు సంబంధించిన ఏ సమాచారాన్ని అయినా వెంటనే తమ సిబ్బందికి సమాచారాన్ని తెలపాలని పుల్లారెడ్డి కోరారు.
తుపాన్ నేపథ్యంలో విద్యుత్ సరఫరా అంతరాయాలు, అత్యవసర సమస్యలు, విద్యుత్ ప్రమాదాల సమాచారాన్ని తెలియజేసేందుకు జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్ల
కృష్ణా జిల్లా 62817 09355
ఎన్టీఆర్ జిల్లా 94408 17561
బాపట్ల జిల్లా 92814 13774
గుంటూరు జిల్లా 94408 17526
ప్రకాశం జిల్లా 94408 17491
పల్నాడు జిల్లా 76610 19447
అత్యవసర విద్యుత్ సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్: 1912


