పేద విద్యార్థిని ఎంబీబీఎస్‌ చదువుకు తోడ్పాటు | - | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థిని ఎంబీబీఎస్‌ చదువుకు తోడ్పాటు

Nov 3 2026 2:21 AM | Updated on Nov 3 2026 2:21 AM

పేద విద్యార్థిని ఎంబీబీఎస్‌ చదువుకు తోడ్పాటు భర్తను రోకలిబండతో కొట్టి చంపిన మహిళ

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: నిరుపేద కుటుంబానికి చెందిన వైద్య విద్య విద్యార్థినికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలిచింది. ఎంబీబీఎస్‌ పూర్తి చేసేందుకు ఏటా రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం నాగర్‌ కర్నూల్‌ జిల్లా అచ్చంపేటకు చెందిన మేకల కాపరి మల్లయ్య కుమార్తె గూదేలి ఝాన్సీ నీట్‌ ప్రవేశ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకు సాధించి సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు పొందినట్లు ఇటీవల ‘సాక్షి’ టీవీలో ప్రసారమైన వార్తకు మానవత సభ్యులు స్పందించారు. కనీసం ఉండటానికి కూడా సరైన ఇల్లు లేని పరిస్థితుల్లో సొంతంగా నీట్‌ ప్రవేశ పరీక్షకు ప్రిపేర్‌ అవుతూనే, ఖాళీ సమయాల్లో తండ్రికి సాయంగా మేకలు కాపలా కాస్తూ ర్యాంకు సాధించినట్లు తెలుసుకున్న మానవత సభ్యులు చలించారు. మేకల కాపరి మల్లయ్యను మానవత రాష్ట్ర కన్వీనర్‌, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారుబోయిన కోటేశ్వరరావు ఫోన్‌లో సంప్రదించి, పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మానవత ద్వారా ఏటా లక్ష రూపాయల చొప్పున ఎంబీబీఎస్‌ చదువుకు ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మొదటి సంవత్సరం ఫీజుకు అవసరమైన రూ.1,07,200 ఝాన్సీ కుటుంబ బ్యాంకు ఖాతాకు జమ చేసినట్లు తెలిపారు. ఏటా ఆమె ఫీజును తామే చెల్లిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. మానవత హనుమాన్‌జంక్షన్‌ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు గంటా ఇందిరాదేవి, పాబోలు గణేష్‌, కోశాధికారి మరీదు వెంకటస్వామి, సినీయర్‌ సభ్యులు జన్యావుల సత్యనారాయణ, కేతినీడి జయప్రకాష్‌, నారగాని కొండలరావు, గంటా సత్యనారాయణ, నరహరిశెట్టి శ్రీధర్‌, వేగిరెడ్డి సూర్యానారాయణ, పొట్లూరి శేషాచలం పాల్గొన్నారు.

పాలకొల్లు సెంట్రల్‌: ఓ మహిళ క్షణికావేశంలో రోకలిబండతో భర్తను కొట్టి చంపిన ఘటన పాలకొల్లు మండలంలో జరిగింది. రూరల్‌ పోలీసులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొల్లు మండలంలోని దగ్గులూరు గ్రామానికి చెందిన చల్లా సూర్యమల్లేశ్వరరావుకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు చల్లా సూర్యప్రకాష్‌ (45) ఉన్నారు. అందరికీ వివాహాలయ్యాయి. 20 ఏళ్ల క్రితం కృష్ణా జిల్లా బంటుమిల్లికి చెందిన కాసా వాణిత్రిపురతో సూర్యప్రకాష్‌కు పెళ్లయింది. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సూర్యమల్లేశ్వరరావు భార్య మూడేళ్ల క్రితం చనిపోవడంతో కుమారుడు సూర్యప్రకాష్‌ వద్దే ఉంటున్నారు. సూర్యప్రకాష్‌ వస్త్ర వ్యాపారం చేసి ఆర్థికంగా నష్టపోయి మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో భార్యాభర్తలు తరచూ గొడవపడుతుండేవారు. ఏడాది కాలంగా సూర్యప్రకాష్‌ అత్తమామలు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. వ్యాపారంలో నష్టపోయి ఆర్థిక భారాన్ని తట్టుకోలేకపోతున్నానని, వెంటనే మీ అమ్మానాన్నలను వాళ్ల ఇంటికి పంపించేయాలని సూర్యప్రకాష్‌ భార్యతో తరచూ గొడవపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సూర్యప్రకాష్‌ బయటకెళ్లి టిఫిన్‌ చేసి ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటికే లోపల నుంచి కొడుకు కేకలు వినిపించడంతో.. సూర్యమల్లేశ్వరరావు ఏమిటా అని వెళ్లి చూశాడు. ఆ సమయంలో సూర్యప్రకాష్‌ రెండు చేతులను కోడలు తండ్రి కాసా లోకేశ్వరరావు వెనక్కి విరిచి పట్టుకోగా.. వాణి త్రిపుర రోకలిబండతో భర్త తలపై బలంగా కొట్టింది. సూర్యమల్లేశ్వరరావు అడ్డుకోగా కోడలి తల్లి బసవకోటమ్మ ఆయనను పక్కకు తోసివేసింది. సూర్య ప్రకాష్‌ తలపై మోది హత్య చేసిన అనంతరం ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. సూర్యమల్లేశ్వరరావు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి సూర్యప్రకాష్‌ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెంది నట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి సూర్యమల్లేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement