రక్తమోడిన రహదారులు | - | Sakshi
Sakshi News home page

రక్తమోడిన రహదారులు

Oct 22 2026 4:02 AM | Updated on Oct 22 2026 4:02 AM

రక్తమోడిన రహదారులు

గంగూరులో ఒకరి మృతి

భర్త కళ్లముందే భార్య మృతి

గన్నవరం: మండలంలోని కేసరపల్లిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామానికి చెందిన బర్రె నాగేంద్రబాబు తేలప్రోలులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో మెషిన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. విజయవాడలోని మేనమామ ఇంటికి వెళ్లిన నాగేంద్రబాబు మంగళవారం ఉదయం బైక్‌పై భార్య లిఖిత, తల్లి సుభాదేవితో కలిసి బండారుగూడెం బయలుదేరారు. కేసరపల్లిలోని వెటర్నరీ కళాశాల వద్దకు రాగనే విజయ వాడ నుంచి ఏలూరు వైపు భవానీ భక్తులతో వెళ్తున్న వ్యాన్‌ వెనుక నుంచి వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పైన ఉన్న ముగ్గురు రోడ్డుపై పడిపోగా, లిఖిత తలపై వ్యాన్‌ వెనుక టైరు ఎక్కడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. భార్య లిఖిత మృతదేహం వద్ద నాగేంద్రబాబు కన్నీరుమున్నీరుగా విల పించాడు. నాగేంద్రబాబు, సుభాదేవి కూడా గాయపడటంతో గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గన్నవరం పోలీసులు తెలిపారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

రెండు బైక్‌లు ఢీకొని..

ఉంగుటూరు మండలం పెద్దఆవుటపల్లికి చెందిన ఉప్పలపాటి సీతారామాంజనేయులు (56) వ్యవసాయ కూలీగా జీవిస్తున్నాడు. కంకిపాడు మండ లంలోని కొలవెన్నులో బంధువుల ఇంటికి వెళ్లిన ఆయన మంగళవారం మధ్యాహ్నం బైక్‌పై తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. కేసరపల్లి శివారు లోని టాడ్‌ ఆయిల్‌ మిల్లు సమీపంలోకి రాగనే బైక్‌పై వేగంగా వెళ్తున్న వ్యక్తి అతడిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సీతారామాంజనేయులను 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి అర్ధరాత్రి 12.40 గంటల సమయంలో అతను మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గన్నవరం పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువతి దుర్మరణం చెందగా, మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా, రామకృష్ణాపురం, దేవరాయబొట్లపాలేనికి చెందిన కల్యాణం రాజేష్‌ (30) ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉద్యోగ విధుల్లో భాగంగా రెండు రోజుల క్రితం విజయవాడ వచ్చాడు. ఈ నెల 19వ తేదీన బీసెంట్‌ రోడ్డులోని ఓ మార్ట్‌ వద్ద క్రెడిట్‌ కార్డు క్యాంపెయిన్‌లో ప్రకాశం జిల్లా కెల్లంపల్లి, పలుకురాల తండాకు చెందిన నలావత్తు సంధ్యాబాయి(21)తో రాజేష్‌కు పరిచయం ఏర్పడింది. అదే రోజు రాత్రి 8:30 గంటల సమయంలో భవానీపురంలో సంధ్యాబాయికి తెలిసిన ఒక వ్యక్తికి క్రెడిట్‌ కార్డు అందజేసేందుకు రాజేష్‌తో కలిసి ఆమె బైక్‌పై బయలుదేరింది. కాళీమాత గుడి ఎదురుగా వచ్చేసరికి వెనుక వైపు నుంచి బస్టాండ్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వారి బైక్‌ను ఢీకొట్టింది. ఇద్దరూ కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108లో వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం తెల్లవారుజామున సంధ్యాబాయి మృతి చెందింది. రాజేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆటోను ఢీకొన్న కారు.. మహిళ మృతి

ఉయ్యూరు(కంకిపాడు): రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటనపై ఉయ్యూరు రూరల్‌ పోలీసుస్టేషన్‌లో మంగళవారం రాత్రి కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై ఓ ఆటోను వెనుక నుంచి కారు ఢీకొంది. ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముక్కు నాగమణి (40) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో పాటు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఆకునూరు ఫ్‌లై ఓవర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో రహదారులు రక్తమోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఓ ప్రమాదంలో భర్త కళ్లెదుటే భార్య మృతి చెందింది. ఈ ప్రమాదాలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పెనమలూరు: మండలంలోని గంగూరు గ్రామంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సారిపల్లి జగదీష్‌కుమార్‌(46) కారు డ్రైవర్‌గా జీవిస్తున్నాడు. అతను ఈ నెల 19వ తేదీన బైక్‌పై వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఛాతీకి దెబ్బ తగలటంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు అతడిని పోరంకిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందాడు. మృతుడి కుమారుడు మనోజ్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కారు ఢీకొని వృద్ధుడు మృతి

పెనుగంచిప్రోలు: మండల పరిధిలోని ముంద్ల పాడు క్రాస్‌రోడ్స్‌ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన ఏలూరు లక్ష్మీనారాయణ(65) పొలంలో గేదెలను మేపుకొని తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా విజయవాడ వైపు నుంచి వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అర్జున్‌ తెలిపారు. 00

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement