ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మహాచండీ దేవి అలంకారంలో దుర్గమ్మను పలువురు సినీ నటులు బుధవారం దర్శించుకున్నారు. అమ్మ వారి దర్శనానికి విచ్చేసిన సినీ నటులు మురళీ మోహన్, రాజారవీంద్ర, శ్రీనివాసరెడ్డికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వారికి వేద పండి తులు ఆశీర్వచనం, ఆలయ అధికారులు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు.
మంగళగిరి రూరల్: విజయవాడకు చెందిన మటన్ వ్యాపారి షేక్ మస్తాన్ వలి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మంగళగిరి మండల పరిధిలోని కాజా టోల్‌గేట్ సమీ పంలో బుధవారం ఉదయం 6.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. విజయవాడలో మటన్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న షేక్ మస్తాన్‌వలికి ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద ఫంక్షన్‌కు పెద్ద మొత్తంలో మటన్ ఆర్డర్ రావడంతో తన కారులో మటన్ డెలివరీ చేసి తిరిగి స్వస్థలానికి బయలుదేరాడు. ఈ క్రమంలో హైవే పై హ్యాపీ నేస్ట్ వద్ద ఎటువంటి హెచ్చరికలు, భద్రతా చర్యలు లేకుండా రోడ్డుపై నిలిపి ఉంచిన కంటైనర్ లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షేక్ మస్తాన్ వలి అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ షేక్ నూరుద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు అబ్దుల్ బాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


