కరువు మంట! | - | Sakshi
Sakshi News home page

కరువు మంట!

Oct 3 2026 1:56 AM | Updated on Oct 3 2026 1:56 AM

కరువులో వ్యవ‘సాయమేది’! ● ఎన్టీఆర్‌ జిల్లాలో 13 కరువు మండలాలు ● కరువు ప్రకటించినా.. సాయంపై స్పష్టత ఏది? ● 9,802 హెక్టార్లలో ఖరీఫ్‌ సాగుకు దూరమైన రైతులు

ప్రకటన.. సాయం కోసం ఎదురుచూపు

ఎత్తిపోతల పథకాలపై విమర్శలు

రైతులకు వెంటనే సాయం అందించాలి

రైతు కంట..
కరువులో వ్యవ‘సాయమేది’!

జి.కొండూరు: వర్షాభావం.. సాగునీటి కొరత.. సకాలంలో అందని నీటి వనరులు.. వెరసి ఎన్టీఆర్‌ జిల్లాలో ఖరీఫ్‌ సాగు తీవ్రంగా దెబ్బతింది. జిల్లాలోని 17 మండలాలకు గాను 13 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటిం చింది. అయినప్పటికీ కరువు ప్రభావిత రైతులకు అందించాల్సిన ఉపశమన చర్యలపై స్పష్టత లేకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. సాగు చేసిన కొందరు పంటలు దెబ్బతిని నష్టపోగా.. నీటి లభ్యత లేక మరికొందరు పొలాలను సాగు చేయకుండానే వదిలేశారు. ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించినా సాయం ప్రకటన లేకపోవడంతో దింపుడు కళ్లెం ఆశలా మిగిలిపోయింది. ప్రభుత్వం ఇకనైనా చిత్తశుద్ధితో కరువు సాయం అందించాలని రైతులు, రైతు సంఘాల నేతలు కోరుతున్నారు.

44 శాతం వర్షపాతం లోటు

ఖరీఫ్‌ సీజన్‌లో జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు జిల్లాలో సాధారణంగా 574.01 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 319 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైనట్లు అధికారులు అంచనా వేశారు. దీంతో 44 శాతం లోటు నమోదైంది. వర్షపాతంతో పాటు భూగర్భజలాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని 13 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. రెడ్డిగూడెం, కంచికచర్ల, చందర్లపాడు మండలాల్లో వాటిని తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించారు.

చందర్లపాడులో అత్యల్ప సాగు

చందర్లపాడు మండలంలో 7,553 హెక్టార్లలో ఖరీఫ్‌ సాగు జరగాల్సి ఉండగా 3,250 హెక్టార్లలోనే సాగైంది. అంటే లక్ష్యంలో 43 శాతం మాత్రమే నమోదైంది. పెనుగంచిప్రోలులో 4,467 హెక్టార్లకు గాను 2,577 హెక్టార్లు, నందిగామలో 6,329 హెక్టార్లకు గాను 4,144 హెక్టార్లలో సాగు చేశారు. ఇదిలా ఉండగా కరువు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం సాయంపై ఎటువంటి స్పష్టతను ఇవ్వలేదు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటనలు తప్ప సాయం చేసేది ఉండదని మరోసారి స్పష్టమైంది.

కరువు మండలాల ప్రకటనతో కొంత ఊరట లభించినా.. రైతులకు అందే ఆర్థిక, వ్యవసాయపరమైన సాయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉందని రైతులు అంటున్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట నష్టం అంచనాలు, రుణాల రీషెడ్యూల్‌, వడ్డీ రాయితీ, తాగునీరు, పశుగ్రాసం వంటి ఉపశమన చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో తుపాన్లు, ఇతర ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు అందాల్సిన సాయం విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉందని రైతు సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.

వర్షాభావానికి తోడు ఎత్తిపోతల పథకాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం సాగునీటి లభ్యతను మరింత దెబ్బతీసిందనే విమర్శలు ఉన్నాయి. నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాల నుంచి చెరువులకు నీటిని మళ్లించలేకపోవడంతో అనేక చెరువులు ఎండిపోయాయని రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలో 542 సాగునీటి చెరువులు ఉండగా.. సెప్టెంబరు వరకు సుమారు 90 శాతం చెరువుల్లో నీరు లేక ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలతో కొన్ని చెరువుల్లోకి నీరు చేరినా.. అప్పటికే సాగు సమయం దాటిపోవడంతో ఆ నీరు పెద్దగా ఉపయోగపడలేదని రైతులు చెబుతున్నారు. వర్షాభావం, నీటి కొరత, సాగు ఆలస్యం కారణంగా జిల్లాలో 9,802 హెక్టార్లలో ఖరీఫ్‌ సాగు జరగలేదు. దీంతో సాగుభూములు బీడుగా మారాయి.

రెడ్డిగూడెం 41.25 4309

కంచికచర్ల 33.08 8692

చందర్లపాడు 40.06 3250

వత్సవాయి 54.06 3805

నందిగామ 59.05 4144

మైలవరం 21.07 4803

జగ్గయ్యపేట 52.01 4228

పెనుగంచిప్రోలు 50 2577

వీరులపాడు 53.02 5463

ఎ.కొండూరు 49.09 5932

విస్సన్నపేట 43.01 3753

జి.కొండూరు 44.08 6046

ఇబ్రహీంపట్నం 52.03 2499

కరువు కారణంగా జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరువు మండలాల ప్రకటనలోనే జాప్యం జరిగింది. పంట నష్టం అంచనాలు ఎప్పుడు పూర్తవుతాయో, సాయం ఎప్పుడు అందుతుందో స్పష్టత లేదు. సకాలంలో సాయం అందితే రబీ సాగుపై రైతులు దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇకనైనా స్పందించి కరువు సాయాన్ని వెంటనే అందించాలి.

–పటాపంచల జమలయ్య, రాష్ట్ర కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement