దుర్గగుడికి
స్వచ్ఛాంధ్ర పురస్కారం
పటమట(విజయవాడతూర్పు): గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన స్వచ్ఛ దివస్ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు–2026 కార్యక్రమాన్ని శుక్రవారం లబ్బీపేటలోని ఏ–కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విజయవాడ నగర పాలక సంస్థకు రాష్ట్రస్థాయిలో ‘స్వచ్ఛ నగరం’ అవార్డు లభించగా, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి పి. నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ వీఎంిసీ డాక్టర్ జి.లక్ష్మీశ, కమిషనర్ ధ్యానచంద్ర అవార్డును అందుకున్నారు. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో 3 లక్షలు, అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల కేటగిరీలో వీఎంసీ రాష్ట్రస్థాయి అవార్డును సైతం అందుకుంది.
నిరంతరం ప్రత్యేక కార్యక్రమాలు
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన విజయవాడ నగరపాలక సంస్థ, సిటీ టెర్రస్ గార్డెన్ ఎన్జీవో కేటగిరీలో అవార్డులు సాధించడం ఎంతో ఆనందదాయకమన్నారు. కేవలం ఇవే కాకుండా స్కూళ్లు, గ్రామాల పరిధిలో, వివిధ కేటగిరీల్లో అవార్డులు కచ్చితంగా సాధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో, స్వచ్ఛమైన వాతావరణంతో తీర్చిదిద్దేందుకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిరంతరం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సునీల్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
జిల్లా పరిషత్‌కు అవార్డు
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా పరిషత్‌కు పలు అంశాల్లో అవార్డు లభించింది. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛత అవార్డును జెడ్పీ సీఈఓ డాక్టర్ జె.అరుణ సీఎం చంద్రబాబు నుంచి అందుకున్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంకు రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛాంధ్ర పురస్కారం అందుకుంది. పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందున ఏపీ ప్రభుత్వం ఈ పురస్కారానికి దుర్గగుడిని ఎంపిక చేసింది. సీఎం చంద్రబాబు నుంచి ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ అవార్డు అందుకున్నారు.


