కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విశేష సేవలందించి, ఇంటింటికీ సంక్షేమాన్ని పంచిన గ్రామ/వార్డు సచివాలయ వలంటీర్లను దారుణంగా అవమానించారు.. వైఎస్సార్ సీపీ ఏజెంట్లుగా ముద్రవేశారు.. వారికి ఇచ్చే రూ.5 వేల గౌరవ వేతనం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే వారిని అవస్థల పాల్జేసి.. ఆ వ్యవస్థనే లేకుండా చేశారు.
సీన్ కట్ చేస్తే.. అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్‌ల పేరిట కొత్త వ్యవస్థను తీసుకొచ్చి భారీగా పంపకాలకు పూనుకుంది. ప్రజాసేవకు ఏమాత్రం ఉపయోగపడని ఒక భజన బృందానికి జనం డబ్బును వాడేందుకు సిద్ధమైంది. కేవలం సర్కారుకు డప్పు కొట్టేందుకే వారికి భారీ నజరానాలు ప్రకటించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో వలంటీర్లుగా పనిచేసిన వారు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. – సాక్షి నెట్‌వర్క్
గండేపల్లి గ్రామంలో ఐదేళ్లు వలంటీర్‌గా సేవా దృక్పథంతో పని చేశాను. ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు చేరువ చేయడంలో కీలకంగా వ్యవహరించాను. కొందరు వలంటీర్లను నోటికొచ్చినట్లు విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా గౌరవ వేతనం రూ.10వేలు చేసి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్లను మోసగించారు.
యాదాల వర్ధన్, మాజీ వలంటీర్, గండేపల్లి, కంచికచర్ల
అన్ని వర్గాల ప్రజలకూ అండగా నిలిచాం. ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి ఇంటికీ సుమారు 1500 రకాల సేవలను అందజేశాం. కరోనా వంటి కష్ట కాలంలో, ప్రకృతి విపత్తుల్లో అధికారులు సైతం అందించలేని సేవలను వలంటీర్లుగా మేం అందించాం. ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడకుండా ప్రజలకు సేవలను అందించామని గర్వంగా చెబుతాం. అలాంటి మాకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.5 వేలు కాదు, రూ.10 వేలు ఇస్తామని నమ్మబలికారు. అధికారంలోకి రాగానే వలంటీరు వ్యవస్థను తొలగించేశారు. బుడమేరు వరదల్లోనూ వలంటీర్ల సేవలను వినియోగించుకున్న సర్కారు వలంటీర్లకు ద్రోహం చేసింది. –సయ్యద్ రెహ్మతుల్లా, మాజీ వలంటీర్, కంకిపాడు


