సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలి | - | Sakshi
Sakshi News home page

సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలి

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): విద్యా ఒత్తిడి, పరీక్షలు, వృత్తిపరమైన బాధ్యతలు ఇలా దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలని ప్రముఖ బౌద్ధ గురువు సింగ్హా రిన్‌పోచే అన్నారు. ప్రశాంతమైన, సానుకూలమైన, సమతుల్యమైన మనస్సును ఎలా పెంపొందించుకోవాలో ఆయన వివరించారు. విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీని మంగళవారం ప్రముఖ బౌద్ధ గురువు సింగ్హా రిన్‌పోచే సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బందితో నిర్వహించిన కార్యక్రమంలో ‘విద్య, దైనందిన జీవితంలో సమతుల్యమైన మనస్సును అభివృద్ధి చేసుకోవడం’ అనే అంశంపై సదస్సు జరిగింది. విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని రిన్‌పోచేతో పరస్పర చర్చలో పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండలరావు మాట్లాడుతూ వైద్య విద్యార్థులు భవిష్యత్తులో రోగులకు సేవలందించే వైద్యులుగా ఎదగాలంటే, ఇతరుల ఆరోగ్యంతో పాటు తమ మానసిక ప్రశాంతతను, సమతుల్యతను కాపాడుకోవడం ఎంతో అవసరం అన్నారు.

బందరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా పద్మశ్రీ

లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జనరల్‌ సర్జరీ విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్‌ జి. పద్మశ్రీ మచిలీపట్నం జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు. ఇప్పటి రాష్ట్ర వ్యాప్తంగా 9 మందికి అడిషనల్‌ డైరెక్టర్‌లుగా ఉద్యోగోన్నతులు కల్పించి, రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లోని ఆస్పత్రి సూపరింటెండెంట్‌లుగా, వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్‌గా నియామకాలకు సంబంధించి దస్త్రం ముఖ్యమంత్రి ఆమోదం పొందినట్లు తెలిసింది. ఈ మేరకు మచిలీపట్నం జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ జి. పద్మశ్రీ బాధ్యతలు చేపట్టనున్నారు. గుంటూరులో సుదీర్ఘకాలం పనిచేసిన ఆమె, అక్కడ డెప్యూటీ సూపరింటెండెంట్‌గా సేవలు అందించారు. ప్రస్తుతం రెండేళ్లుగా విజయవాడలో సర్జరీ విభాగాధిపతిగా ఉన్నారు.

విద్యుత్‌ సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు కృషి

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ పరిధిలో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతోపాటు పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏపీసీపీడీసీఎల్‌) ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ టీవీఎస్‌ఎన్‌ మూర్తి చెప్పారు. ఏపీసీపీడీసీఎల్‌ పరిధిలోని నగరంలోని గవర్నరుపేట, ఆర్‌ఆర్‌ పేటల్లో జరుగుతున్న విద్యుత్‌ ఇండోర్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంతో పాటు, నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రవికిషోర్‌తో పాటు ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు, సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.

ఎ.కొండూరు తండాలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభం

ఎ.కొండూరు: మండలంలోని విద్యుత్‌ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. మండల పరిధిలోని ఎ.కొండూరు తండాలో రూ.94.97కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 220/132/33కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాఽథ్‌, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు, రైతులకు, పరిశ్రమలకు ఎలాంటి లో–వోల్టేజీ, విద్యుత్‌ అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతోనే కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సబ్‌స్టేషన్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement