యువజనోత్సవం సందర్భంగా పోటీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): యువత విద్యతో పాటు, వివిధ కళా నైపుణ్యాలను పెంచుకోవాలని రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ కమిషనర్ ఎస్. భరణి అన్నారు. జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవం మంగళవారం నలంద డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉత్సాహంగా సాగింది. ఈ ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భరణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా.. ఫోన్ డ్యాన్స్, ఫోక్ సాంగ్స్, నుక్కడ్‌నాటక్(వీధి నాటకం), పెయింటింగ్, పొయెట్రీ రైటింగ్ వంటి అంశాలపై పోటీలు ఉత్సాహంగా సాగాయి. పోటీల్లో 300 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నలంద ప్రిన్సిపాల్ ఎం. అనురాధ మాట్లాడుతూ ఇలాంటి సాంస్కృతిక పోటీలతో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి, ఉత్సాహం నింపవచ్చన్నారు.
బహుమతులు ప్రదానం..
జిల్లా యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన వారు రాష్ట్ర స్థాయికి, అక్కడ బహుమతి సాధించిన వారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విజేతలకు యువజన సర్వీసుల శాఖ డెప్యూటీ డైరెక్టర్ ఎస్‌వీడీఎస్ రామకృష్ణ, యూత్ ఆఫీసర్ బి. ప్రదీప్‌కుమార్, క్రిషి మేనేజర్ డి. సుబ్బారావు, డాక్టర్ సమరం చేతుల మీదగా బహుమతులు అందజేశారు.


