మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): తెలుగు భాషలో ఉన్న విజ్ఞాన వ్యాప్తికి ఇలాంటి సమ్మేళనాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. నగరంలోని రమేష్ ఆస్పత్రి రోడ్డులో ఉన్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా) కళాశాల ఆవరణలోని కృష్ణవేణి సభాఘర్‌లో సోమవారం మొదలైన ఆంధ్ర విజ్ఞాన సమ్మేళనం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ హాజరయ్యారు. దేశంలోని వివిధ ఆలయాల నమూనాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి సందర్శించారు.
సంప్రదాయాల పరిరక్షణకు దోహదం..
అనంతం ఏర్పాటు చేసిన సభలో సత్యకుమార్ మాట్లాడుతూ భారతీయ జ్ఞాన సంప్రదాయాల పరిరక్షణకు, పరిశోధనాత్మక ఆలోచనలకు ఈ సమ్మేళనం ఒక వేదికగా నిలిచిందన్నారు. 20 సూత్రాల కార్యక్రమాల కమిటీ చైర్మన్ లంకా దినకరన్, విజ్ఞాన భారతి జాతీయ కార్యదర్శి కొంపెల్ల శాస్త్రి, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల డైరెక్టర్ రమేష్ శ్రీకొండ, ఆంధ్రా విజ్ఞాన సమ్మేళనం కో–ఆర్డినేటర్ కార్తీక్ చదలవాడ పాల్గొన్నారు. యోగా, ఆయుర్వేదం, గణితం, ఖగోళశాస్త్రం, భారతీయ జ్ఞాన పరంపర, కృత్రిమ మేధస్సు (ఏఐ)–నైతికత అంశాలపై, ప్రాచీన భారతీయ విజ్ఞాన సంపదను ఆధునిక శాసీ్త్రయ పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానిస్తూ విద్యావేత్తలు, నిపుణులు చర్చలు జరిపారు. వివిధ విద్యాసంస్థలకు చెందిన పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు.


