కానూరులో కుప్పకూలిన డ్రెయిన్
రూ.24.50 లక్షలతో నిర్మాణం
నాణ్యతపై అనుమానాలు..
పెనమలూరు: తాడిగడప మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీడీపీ అవినీతి దందా బట్టబయలైంది. కానూరులో ఇటీవల నిర్మించిన డ్రైనేజీ కొద్దిరోజులకే కుప్పకూలడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.24.50 లక్షల వ్యయ అంచనాతో చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
25 మీటర్ల మేర కూలిన డ్రైన్
కానూరులోని పంటకాలువ రోడ్డులో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇంటి సమీపంలోని రహదారి పక్కన డ్రైనేజీ నిర్మాణానికి తాడిగడప మున్సిపాలిటీ నిర్ణయించింది. ఇందుకు గత ఏప్రిల్‌లో టెండర్లు పిలిచారు. జూలైలో పనులు ప్రారంభించి, రహదారికి ఒకవైపు డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. మరోవైపు పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే నిర్మించిన డ్రైనేజీలో సుమారు 25 మీటర్ల మేర భాగం రెండు రోజుల క్రితం కూలిపోయి కాలువలో పడింది. నిర్మాణం పూర్తయిన కొద్దిరోజులకే డ్రైన్ కూలిపోవడంతో స్థానికులు పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలను అధికారులు పరిశీలించారా? లేదా అన్నదానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పని చేసిన కాంట్రాక్టర్.. నేతకు ముఖ్య అనుచరుడు కావటంతో మౌనంగా ఉండిపోయారని తెలుస్తోంది.
ఇనుప చువ్వలపై ప్రశ్నలు
కూలిన డ్రైన్ నిర్మాణాన్ని పరిశీలించిన స్థానికులు ఇనుప చువ్వల వినియోగంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ నిర్మాణంలో అవసరమైన మేరకు రాడ్లు, కాంక్రీట్ వంటి నిర్మాణ సామగ్రిని ఉపయోగించారా? అనే అంశంపై సాంకేతికంగా పరిశీలన జరపాలని కోరుతున్నారు. కూలిన భాగంలో ఇనుప చువ్వలు కనిపించకపోవడంపై కూడా వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిర్మాణంలో ఏ మేరకు నిబంధనలు పాటించారనే విషయం సాంకేతిక పరిశీలనతోనే తేలాల్సి ఉంది. మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు డ్రైన్ కూలిన కారణాలను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ డ్రైనేజీ పనులలో కాంట్రాక్టర్‌కు ఒక అఽధికారి పార్ట్‌నర్‌గా ఉండి పెట్టుబడి పెట్టాడని గుసగుసలు వినబడుతున్నాయి.
విచారణ జరపాలని డిమాండ్
రూ.24.50 లక్షలతో చేపట్టిన పనులు కొద్దిరోజులకే దెబ్బతినడంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. డ్రైనేజీ నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రి నాణ్యత, నిర్మాణ పద్ధతులు, అధికారుల పర్యవేక్షణ తదితర అంశాలను పరిశీలించాలని కోరుతున్నారు. అవసరమైతే విజిలెన్స్ లేదా సంబంధిత సాంకేతిక విభాగం ద్వారా తనిఖీలు నిర్వహించి, లోపాలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి పనులు నాణ్యతతో ఉండేలా అధికారులు కఠినంగా పర్యవేక్షించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
కొద్దిరోజులకే కూలిన వైనం


