పోలీసుల కళ్లుగప్పి లోక్‌భవన్‌ను ముట్టడించిన బీఎస్పీ ప్రధానగేటు వద్దకు దూసుకెళ్లిన ఆందోళనకారులు గేటు ముందు బైఠాయించి ధర్నా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓ వైపు డీజీపీ క్యాంపు, సీపీ కార్యాలయాలు, మరో వైపు సూర్యారావుపేట పోలీసు స్టేషన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఇంకో వైపు కోర్టుల సముదాయం, ఆ సమీపంలో ఉన్న లోక్‌భవన్ వద్ద భద్రతా వైఫల్యం బట్టబయ లైంది. పోలీసులు కళ్లు గప్పి వందలాది మంది బీఎస్పీ కార్యకర్తలు బుధవారం లోక్‌భవన్‌ను ముట్ట డించారు. జెండాలు, ప్లకార్డులు పట్టుకుని ఏకంగా లోక్‌భవన్ ప్రధాన గేటు వద్దకు దూసుకెళ్లారు. గేటు వద్ద బైఠాయించి ధర్నా చేశారు. దళితులపై దాడులు, హత్యల విషయంలో గవర్నర్ స్పందించాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, లైంగికదాడులు, హత్యలు, మహిళను వివస్త్రను చేసి చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలపై గవర్నర్ స్పందించాలంటూ బీఎస్సీ ఆధ్వర్యంలో దళితులు ఆందోళనకు దిగారు. తొలుత దళితులు పెద్ద సంఖ్యలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం వద్దకు చేరుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి అక్కడికి చేరుకున్న దళితులు అంబేడ్కర్ కళావేదిక పక్క నుంచి ఒక్కసారిగా లోక్‌భవన్‌ను ముట్టడించారు. 300 మందికి పైగా ఆందోళనకారులు రాష్ట్రంలోని దళితులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ లోక్‌భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అక్కడ నుంచి పంపే ప్రయత్నం చేశారు. గవర్నర్ స్పందించే వరకు అక్కడ నుంచి వెనక్కు వెళ్లేది లేదంటూ ఆందో ళన కారులు పట్టుబట్టారు. లోక్‌భవన్ అధికారులు గవర్నర్‌కు సమాచారం ఇవ్వడంతో.. బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్‌తో పాటు మరికొందరికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. శాసన సభ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దళితులపై చేసిన వ్యాఖ్యలు, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జరిగిన దళితుల హత్యలపై గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం లోక్‌భవన్ వద్ద గౌతమ్‌కుమార్ మాట్లా డుతూ.. రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులు, హత్యలపై సమగ్ర నివేదిక తెప్పించుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారని తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ సంపత్‌రావు, ప్రధాన కార్యదర్శి చిత్రసేన్, నాగరాజు, తెనాలి ప్రకాష్ తదితరులు ఉన్నారు.


