ఉపాధ్యాయ సంఘాల సూచనలు పట్టించుకోలేదని ఆగ్రహం పోరాటానికి సిద్ధమవుతున్న ఉపాధ్యాయులు ఉమ్మడి కృష్ణాజిల్లాలో 10,559 మంది ఉపాధ్యాయులు టెట్ రాయాల్సిన వారు ఆరువేలకు పైమాటే
టెట్ నోటిఫికేషన్‌పై మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇన్ సర్వీస్ టీచర్ల కోసం విడుదల చేసిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్‌పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం టెట్ అంశంపై వివిధ ఉపాధ్యాయ సంఘాలు చేసిన సూచనలను పెడచెవిన పెట్టి ఏకపక్షంగా నోటిఫికేషన్ ఇచ్చారంటూ నాయకులు మండిపడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలు టెట్ పరీక్షపై గత కొద్ది మాసాలుగా వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నా పాలక పక్షం స్పందించకపోవటంపై వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే మండిపడుతున్న ఉపాధ్యాయులు ప్రత్యేక టెట్‌లోనూ ఎటువంటి మినహాయింపులు ఇవ్వకపోవటంతో సంఘాలు ఆగ్రజ్వాలలను రగిలించినట్లయింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారుగా 2,263 ప్రభుత్వ యాజమాన్య విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. అందులో సుమారుగా 10,559 మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా వారిలో 75శాతం ఉపాధ్యాయులు టెట్ రాయాల్సి ఉన్నట్లుగా ఉపాధ్యాయ సంఘాల నేతలు వివరిస్తున్నారు.
సుప్రీం తీర్పు నేపథ్యంలో..
ఉపాధ్యాయులు సాధారణ డిగ్రీలతో పాటు వృత్తిపరమైన డీఎడ్, బీఎడ్ వంటి కోర్సులు పూర్తి చేసిన వారు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించే ముందు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు సైతం టెట్ ఉత్తీర్ణులు కావాల్సిందేనని పేర్కొంది. ఐదేళ్లలో ఉద్యోగ విరమణ చేసేవారికి మాత్రం ప్రభుత్వం దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. సుప్రీం తీర్పుతో ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. విద్యాహక్కు చట్టం–2009 ప్రకారం దేశంలో టెట్ విధానం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో 2011 నుంచి టెట్ నిర్వహిస్తున్నారు. 2011కు ముందు ఉన్న ఉపాధ్యాయులు సైతం ఇప్పుడు టెట్ రాయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఐదేళ్ల పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు 2028 ఆగస్టు ఒకటో తేదీ లోపు టెట్ ఉత్తీర్ణులు కావాల్సి ఉంది. దీంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.
అంతా గందరగోళం..
సుప్రీంకోర్టు తీర్పు, టెట్ పరీక్ష, ఉపాధ్యాయుల ఆందోళన తదితర అంశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్ నిర్వహిస్తామంటూ ప్రకటించింది. అయితే అందులో ప్రస్తుతం ఉన్న టీచర్లకు వెసులుబాటు ఉంటుందని, కొన్ని మినహాయింపులు చేస్తారని ఉపాధ్యాయ సంఘాలు భావించాయి. అదేవిధంగా పాస్ మార్కులు తగ్గిస్తారని, ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారని ఎదురు చూస్తున్నారు. కానీ అటువంటివి ఏమీ లేకపోయే సరికి ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. దానికి తోడు ఈ నెల ఐదు నుంచి 16వ తేదీ వరకూ సాధారణ టెట్ నిర్వహించారు. ఈ ఫలితాలు సెప్టెంబర్ 15వ తేదీన ప్రకటించనున్నారు. ఆ ఫలితాలు రాకుండానే స్పెషల్ టెట్ పేరుతో ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో ఉపాధ్యాయుల్లో సహజంగానే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు టెట్ రాసిన ఇన్ సర్వీస్ టీచర్లు మళ్లీ టెట్‌కు దరఖాస్తు చేయాలా.. మరోసారి ఫీజు చెల్లించాలా.. టెట్ ఫలితం వచ్చే వరకూ వేచి ఉండాలా అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. పైగా సాధారణ టెట్ మాదిరిగానే అర్హత మార్కులున్నాయి. టెట్ వెయిటేజీ పరీక్ష విధానంలో సైతం ఎటువంటి మార్కులూ లేవు. మరోవైపు స్పెషల్ టెట్ నోటిఫికేషన్‌లో సైతం సాధారణ టెట్‌లో ఉన్న అంశాలే ఉండటంతో వారు విస్మయానికి గురవుతున్నారు.
జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులు
పాఠశాలలు
కృష్ణా 1,343 5,468
ఎన్టీఆర్ 920 5,091
మొత్తం 2,263 10,559


