తాత్కాలిక షెడ్డులోనే ఈఎస్‌ఐ ఆస్పత్రి కనీస సౌకర్యాలు లేక చందాదారుల ఇక్కట్లు అరకొర సౌకర్యాలతో కుస్తీ పడుతున్న వైద్యులు చిన్నపాటి సర్జరీలకూ ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్
నాణ్యమైన వైద్యం లేదు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలంటూ కార్మికులు పోరాటాలు చేస్తారు.. ప్రతినెలా కొంత మొత్తం ఈఎస్‌ఐ చందా చెల్లిస్తుంటారు.. కానీ అందే వైద్యం అంతంత మాత్రమే. రెండేళ్లుగా తాత్కాలిక షెడ్డుల్లో ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. అక్కడ కనీస సౌకర్యాలు లేక పోవడంతో ఎలాంటి చిన్న సర్జరీ చేయాలన్నా ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. అక్కడ రోగులకు ఎంతో కొంత డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు జిల్లాలకు పెద్దదిక్కుగా..
విజయవాడ గుణదలలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి నాలుగు జిల్లాలోని సుమారు 5.8 లక్షల మంది చందాదారుల వైద్య సేవలకు పెద్దదిక్కుగా ఉంది. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని చందాదారులు డిస్పెన్సరీల నుంచి మెరుగైన వైద్యం కోసం ఇక్కడకు వస్తుంటారు. కానీ ఇక్కడ తాత్కాలిక భవనాల్లో అరకొర సౌకర్యాలతో సేవలు అందని పరిస్థితి నెలకొంది. నిపుణులైన వైద్యులు ఉన్నా, తాత్కాలిక భవనాల్లో ఆపరేషన్ థియేటర్‌లతో సర్జికల్ పరికరాలు లేక పోవడంతో శస్త్ర చికిత్సలు నిర్వహించడం లేదు. దీంతో చిన్నపాటి శస్త్ర చికిత్స చేయాలన్నా ప్రైవేటు ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు.
ప్రైవేటులో అదనపు వసూళ్లు
ఈఎస్‌ఐ ఆస్పత్రి నుంచి రిఫర్ చేయించుకొని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందని పలువురు చందాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు సూపర్‌స్పెషాలిటీ సేవలకు మాత్రమే ప్రైవేటుకు పంపించేవారు, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, గైనకాలజీ వంటి విభాగాల్లో ఈఎస్‌ఐ ఆస్పత్రిలోనే సర్జరీలు చేసేవారు. ఇప్పుడు సౌకర్యాలు లేమితో అన్ని శస్త్ర చికిత్సల కోసం ప్రైవేటుకు పంపిస్తున్నారు. అక్కడికెళితే కొన్ని చికిత్సలకు ఈఎస్‌ఐ కవరేజ్ రాదంటూ రోగుల నుంచి అదనంగా వసూళ్లు చేస్తున్నారు. ఈ విషయమై ఈఎస్‌ఐ అధికారులకు కార్మిక సంఘాలు ఫిర్యాదులు చేసినా చర్యలు ఉండటం లేదు.
భవనం ఇంకెప్పుడు?
ఐదు దశాబ్దాల నాడు నిర్మించిన ఈఎస్‌ఐ ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని గతంలో భావించారు. దీంతో తాత్కాలిక భవనాలను నిర్మించి, వైద్య సేవలను అక్కడకు మార్చారు. తాత్కాలిక భవనాల్లోకి మారి ఏడాదిన్నర గడుస్తున్నా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. ఒకప్పుడు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లేవారు. రాష్ట్ర విభజన తర్వాత రిఫర్ చేసే అవకాశం లేదు. దీంతో విజయవాడలో సూపర్‌స్పెషాలిటీ సేవలు అందించేలా అత్యాధునిక సౌకర్యాలతో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని భావించినా, అది కార్యరూపం దాల్చడం లేదు. దీంతో చందాదారులకు ఇక్కట్లు తప్పడం లేదు.
కార్మికులు ఈఎస్‌ఐ ద్వారా నాణ్యమైన వైద్యసేవలు ఉచి తంగా పొందొచ్చని భావిస్తారు. కానీ విజయవాడలో ఈఎస్‌ఐ ఆస్పత్రి తాత్కాలిక భవనాల్లో నిర్వహించడంతో, శస్త్ర చికిత్స అంటే ప్రైవే టుకు రిఫర్ చేస్తున్నారు. అక్కడ ఎంతో కొంత డబ్బులు చెల్లించుకోవాల్సిన వస్తోందని పలువురు చందా దారులు చెబుతున్నారు. విజయవాడలో ఈఎస్‌ఐ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి కలగానే మిగిలింది. ఇప్పటికై నా పాలకులు ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణంపై దృష్టి పెట్టాలి.
– డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం


