పామర్రు: స్థానిక శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో అక్టోబర్ ఆరు, ఏడు తేదీల్లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాతీయ వర్క్ షాపు నిర్వహించనున్నట్లు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య డి.మునిరత్నం నాయుడు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.
విశ్వ వ్యాప్తమైన కూచిపూడి నృత్యానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ మరింత గుర్తింపు ఇచ్చేలా కేంద్రీయ విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ వర్క్‌షాప్‌లో రెండు రోజుల పాటు 100 మంది ఔత్సాహిక నాట్య విద్యార్థులకు శిక్షణ తరగతులు (వర్క్‌షాపు) నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు విజయ వంతం కోసం కృష్ణాజిల్లా సహాయ కలెక్టర్ సమత్రా అగర్వాల్ అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది. పగలు ఔత్సాహికు లకు వర్క్‌షాప్, రాత్రి వేళ నిష్ణాతులైన కళాకారులతో నాట్య ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీ టూరిజం కన్స ల్టెంట్ అజ్వంత్ నాయుడు, ప్రముఖ నాట్యాచారిణి సుమిత్రా పార్థసారథి, కల్చరల్ కన్సల్టెంట్ సీహెచ్.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవిబాలకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు, టీచింగ్ అసిస్టెంట్ ఎస్.వెంకటేశ్వరరావు, పసుమర్తి హరినాథశాస్త్రి, గ్రంథాలయ పాలకులు వై.వి.ఫణికుమార్, తహసీల్దార్ కె.మస్తాన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


