కంకిపాడు: మండలంలోని కుందేరు రైతు సేవ కేంద్రాన్ని కేరళ పౌరసరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్ గురువారం సందర్శించారు. రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్న విధానాన్ని పరిశీలించేందుకు ఆర్‌ఎస్‌కేను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ–క్రాప్ నమోదుతో పంట నిర్ధారణ, దిగుబడులు అంచనా, ధాన్యం సేకరణలో తేమశాతం పరిశీలనకు తీసుకుంటున్న చర్యలు పరిశీలించారు. రైతులకు గోనె సంచులు అందజేత, రవాణా సౌకర్యాల కల్పన, రైతులకు సొమ్ముచెల్లింపులపై ఆరా తీశారు. ధాన్యం సేకరణ తీరుపై స్థానిక అధికారులతో సమీక్షించారు. ఉయ్యూరు ఆర్‌డీఓ కరుణకుమారి, తహసీల్దార్ వీ.భావనారాయణ, ఏఓ ఉషారాణి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
పైలెట్ ప్రాజెక్టుకు గన్నవరం మండలం ఎంపిక
చిలకలపూడి(మచిలీపట్నం):‘మీ భూమి–బ్లాక్ చెయిన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థ’ పైలెట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలి దశలో ఈ పైలెట్ ప్రాజెక్టు అమలుకు జిల్లాలోని గన్నవరం మండలాన్ని ఎంపిక చేశారు. మండలంలోని 18 గ్రామాలకు చెందిన 25,680 భూ ఖాతాలను ఈ వ్యవస్థలో నమోదు చేయనున్నారు. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో విడివిడిగా ఉన్న భూ సమాచారాన్ని ఒకే వేదికపై సమీకరించడం ద్వారా భూ రికార్డుల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టనున్నారు. ఈ సాంకేతిక వ్యవస్థ ద్వారా భూ రికార్డులకు ఒకే ప్రామాణిక సమాచారం (సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్) అందుబాటులోకి వస్తుందని, రికార్డుల్లో అక్రమ మార్పులు, భూ మోసాలకు అడ్డుకట్ట పడటంతో పాటు భూ సంబంధిత సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు అందించే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. పోతురాజు, గుడివాడ ఆర్డీవో జి. బాలసుబ్రహ్మణ్యం, గన్నవరం తహసీల్దార్ శివయ్య, సర్వే శాఖ సహాయ సంచాలకుడు లక్ష్మణరావు, వ్యవసాయ శాఖ అధికారి జ్యోతి రామణి, మత్స్యశాఖ అధికారి అయ్యా నాగరాజా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ కాంక్లేవ్‌ను శుక్రవారం నుంచి 26 వరకు విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్‌లో నిర్వహించనున్నట్లు బీఎన్‌ఐ విజయవాడ చాప్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్‌దేశాయ్ తెలిపారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం 128 స్టాళ్లతో ఎక్స్‌పో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ రంగాలకు చెందిన సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించడంతో పాటు కొత్త కస్టమర్లు, వ్యాపార భాగస్వాములను కలుసుకునే అవకాశాన్ని ఈ ఎక్స్‌పో కల్పిస్తుందని చెప్పారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత, బ్యాడ్మింటన్ దిగ్గజ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో నిర్వాహకులు త్రినాథ్ నండూరి, బి.దేవకుమార్, లక్ష్మీ శాంతి కోగంటి, పి.యువకిషోర్, ఎన్.నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ కల్చరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని ఉండవల్లి గుహల సముదాయంలో 25, 26 తేదీలలో నిర్వహించే తెలుగు మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సృజనాత్మక, సాంస్కృతిక సమితి చైర్ పర్సన్ తెలిపారు. గురువారం విజయవాడలోని కార్యాలయంలో మాట్లాడుతూ ఉదయం 6 గంటలకు తొలిరోజు సభలు ప్రారంభమవుతాయన్నారు. రచయిత్రుల కోసం ఆమె మాట అక్షరబాట, కవుల కోసం చెట్టునీడన చిరుగాలి, చిన్నారుల కోసం అమ్మమ్మ ముచ్చట్లు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.


