సీఎం చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే వంశీ లేఖ
గన్నవరం: పోలవరం కుడి కాలువ ద్వారా గన్నవరం నియోజకవర్గంలోని డెల్టా ఆయుకట్టుతో పాటు మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించి ఆదుకోవాలని సీఎం నారా చంద్రబాబునాయుడుకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వల్లభ నేని వంశీమోహన్ లేఖ రాశారు. ఈ మేరకు గురువారం సీఎంకు పంపిన లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. గోదావరి జలాలను మళ్లించే క్రమంలో కృష్ణా డెల్టాతో పాటు పోలవరం కుడి కాలువ సమీపంలో ఉన్న మెట్ట ప్రాంత గ్రామాలకు సైతం నీటిని వాడుకునే అవకాశం కల్పించాలని 2015లో అప్పటి ఎమ్మెల్యేగా తాను విజ్ఞప్తి చేయగా అంగీకరించారని గుర్తు చేశారు. ఆ సమయంలో తన సొంత ఖర్చులతో మోటార్లు ఏర్పాటు చేయగా.. నీటి సరఫరా జరిగిందన్నారు. ఆ తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ మోహన్‌రెడ్డి దానిని కొనసాగించారని చెప్పారు.
ఇప్పుడు అడ్డగింత..
అయితే ఈ ఏడాది మాత్రం పట్టిసీమ నీటిని మెట్ట ప్రాంతానికి మళ్లించకుండా నీటి పారుదల అధికారులు పోలీసుల బందోబస్తుతో ఎక్కడికక్కడ మోటర్లను నిలిపివేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న మెట్ట ప్రాంత రైతులకు పట్టిసీమ నీరు ఆగిపోవడం మరింత ఆందోళనకరంగా మారిందన్నారు. క్షేత్రస్థాయిలో పంటలు ఎండిపోతున్న పరిస్థితులు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో పట్టిసీమ నీటిని వాడుకునే విధంగా సత్వర చర్యలు తీసుకుని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.


