పామర్రు: చిన్నపాటి విభేదాల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్య యత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఘటన పామర్రు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పామర్రు మండలం నెమ్మలూరు శివారు మలయప్పన్న పేట గ్రామానికి చెందిన కాకి పవన్‌కుమార్(35) భార్య నాగలక్ష్మితో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. దాంపత్య జీవితంలో కుటుంబ విషయాలకు సంబంధించిన చిన్న చిన్న విభేధాల కారణంగా భార్య తన పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన పవన్‌కుమార్ ఈనెల 11వ తేదీ ఉదయం పురుగుల మందును తాగాడు. విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు వెంటనే మచిలీపట్నంలోని ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పామర్రు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
అదృశ్యమైన వ్యక్తి విగతజీవిగా మున్నేటిలో లభ్యం
నందిగామ రూరల్: రెండు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి మృతదేహం మునేటిలో లభ్యమైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన ఉప్పుటూరి అప్పారావు కొంతకాలంగా నందిగామ పట్టణం, వత్సవాయిలో పురుగుల మందుల దుకాణాన్ని నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 10న వత్సవాయిలోని దుకాణం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. రాత్రికి ఇంటికి రాకపోవడంతో ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేదు. దీంతో ఈ నెల 11వ తేదీ అతని భార్య ఉమామహేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న మృతుని బావమరిది (భార్య సోదరుడు) రాఘవాపురం సమీపంలోని మున్నేటి వద్ద రోడ్డు పక్కగా అప్పారావు ద్విచక్ర వాహనం నిలిపి ఉండటాన్ని గమనించాడు. బహిర్భూమికి వెళ్లి ఉంటాడని భావించి వేచి ఉన్నా ఎంత సేపటికి రాకపోవడంతో అనుమానం వచ్చి మున్నేటి వద్దకు వెళ్లి చూశాడు. అతని మృతదేహం కనిపించటంతో కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.శ్రీను తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


