సాగునీటిపై స్పష్టత కరువు ఎండిపోతున్న వరి నారు మడులు ఆయిల్ ఇంజిన్లకు కూడా అందని పరిస్థితి అరకొర నీటితో అన్నదాతల ఆగచాట్లు
పెడన: నియోజకవర్గంలో రైతు గోడు వినేవారు కానరావడం లేదు. సాగునీటిపై స్పష్టత కరువవడంతో ఇబ్బంది పడుతున్నారు. నీరు లేక వరినారుమడులు ఎండిపోతున్నాయి. నియోజకవర్గంలోని బంటుమిల్లి కాలువ పూర్తిగా ఎండిపోయింది. వేసవిలో సైతం నీరుండే ఈ కాలువలో నీరు లేకపోవడం, ప్రస్తుతం అరకొరగా నీటిని విడుదల చేయడంపై రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
ఖర్చు తడిసి మోపెడు
కాలువలు ద్వారా వస్తున్న అరకొర నీటిని వచ్చింది వచ్చినట్లుగా రైతులు తోడేస్తున్నారు. పూర్తిస్థాయిలో నీరు వస్తే పంటబోదెల ద్వారా పొలాలకు నీరు చేరుతుంది. అంతంత మాత్రంగా వస్తున్న నీటిని తప్పనిసరి స్థితిలో మోటారు ఇంజిన్‌తో తోడుకోవాల్సి వస్తోంది. లీటరు డీజిల్ రూ.110, ఇంజిన్ అద్దె గంటకు రూ.250. ఇంజిను తీసుకువచ్చినప్పటి నుంచి సమయం లెక్కింపు. నీరందకపోతే ఎంత సమయం పడుతుందోననే రైతులు ఆందోళన పడుతున్నారు. నీరు అంతంత మాత్రమే వస్తుండటంతో ఇంజిన్ తీసుకురావడానికి రైతులు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. బంటుమిల్లి కాలువకు శనివారం నీరు వచ్చింది. ఆదివారం ఆ నీటి ప్రవాహం కాస్తా మందగించింది.


