ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం భక్తుల రద్దీ కనిపించింది. వేసవి సెలవులు ముగియనుండటంతో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మరో వైపున ఆదిదంపతులకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 10 గంటల తర్వాత రద్దీ మరింత అధికం కావడంతో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. రూ. 300 టికెట్‌పై బంగారు వాకిలి దర్శనానికి మాత్రమే అనుమతించారు. రద్దీతో వీఐపీలు, సిఫార్సులపై వచ్చిన భక్తులకు సైతం మధ్యాహ్నం రెండు గంటల తర్వాతే అంతరాలయ దర్శనం కల్పించారు.
ఎండ తీవ్రత నేపథ్యంలో..
ఎండ తీవ్రత, వడగాడ్పుల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు దేవస్థానం చలివేంద్రాల ద్వారా చల్లటి మంచినీటితో పాటు మజ్జిగ, లస్సీలను పంపిణీ చేసింది. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి విగ్రహంతో పాటు రాజగోపురం ఎదుట ట్రస్ట్ బోర్డు సభ్యుల కార్యాలయం వద్ద భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. అంతే కాకుండా వాటర్ క్యాన్ల ద్వారా భక్తులు సేదతీరుతున్న చోటికే ఆలయ సిబ్బంది చేరుకుని మంచినీటిని అందించారు.
పంచహారతులకు డిమాండ్..
శుక్రవారం నేపథ్యంలో అమ్మవారి పంచహారతుల సేవకు భక్తుల నుంచి డిమాండ్ కనిపించింది. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి పంచహారతుల సేవ నిర్వహించారు. సాయంత్రం 7 గంటల తర్వాత భక్తుల రద్దీ కొనసాగింది.
సెలవులు ముగియనుండటంతో
భారీగా తరలివచ్చిన భక్తులు


