కళ్లెదుటే గూడు నేలమట్టం
అందుకే తొలగించాం..
మచిలీపట్నంటౌన్: నగర పాలకసంస్థ అధికారులు టీడీపీ నాయకుల ప్రోద్బలంతో మంగళవారం మరో పేదల గూడుపై ప్రతాపం చూపారు. నగరంలోని 5వ డివిజన్ ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్ సమీపంలోని ఓ ఇంటిని పోలీసు పహారా నడుమ కూల్చివేశారు. ఎన్టీఆర్ కాలనీగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో మొత్తం 32 గృహాలుండగా, వాటిలో ఒక్క ఇంటిని మాత్రమే కూల్చివేయడం ఏంటని, ఇది అన్యాయమని స్థానికులు చెబుతున్నారు.
వివరాలు ఇవి..
మిద్దె ఏసు రత్నా కుమార్ (బాబీ), సాయి మహాలక్ష్మి పేద దంపతులు దాదాపు 20 ఏళ్లుగా అదే ప్రదేశంలో ఓ పూరి గుడిసెలో నివసిస్తున్నారు. పానీపూరి, మసాలా బండి నడుపుతూ ఇద్దరు చిన్నపిల్లలతో జీవనం సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో బాబి, అతని కుటుంబ సభ్యులపై ఆ ప్రాంత టీడీపీ నాయకులు దాడులకు పాల్పడి, గృహంలోని వస్తువులను ధ్వంసం చేశా రు. అయినా పోలీసులు బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహనరెడ్డి వీరి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు.
చివరి దశలో ఉండగా..
ఈ నేపథ్యంలో ప్రస్తుతం బాబి తన పూరింటి స్థానంలో రేకుల షెడ్డు నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ దశలో టీడీపీ నాయకులు కార్పొరేషన్ అధికారులను ప్రేరేపించి ఈ ఇంటిని ధ్వంసం చేయించినట్లు తెలుస్తోంది. ‘మేం ఇంకెక్కడికీ వెళ్లలేం.. పిల్లలతో ఎక్కడ ఉండాలో అర్థం కావడం లేదు’ అంటూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా తెల్లారేసరికే పొక్లయిన్‌తో కూల్చటం చర్చనీయాంశమైంది. బాధిత కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న, ఉపాధ్యక్షుడు గూడవల్లి నాగరాజు తదితరులు పరామర్శించారు.
బాబి నూతన గృహాన్ని రోడ్డు స్థలాన్ని ఆక్రమించి నిర్మిస్తున్నందునే తొలగించాం. గతంలో ఉన్న పాత పూరిల్లును తొలగించలేదు. నూతనంగా పక్కాగా నిర్మిస్తున్న నిర్మాణాన్ని మాత్రమే తొలగించాం.
– శ్రీహరి ప్రసాద్, ఎంఎంసీ ఏసీపీ


