చెస్ పోటీల విజేతగా ఎన్టీఆర్ జిల్లా వాసి
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర చెస్ అసోసియేషన్, రామకృష్ణ చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సింగ్‌నగర్ గుజ్జల సరళా దేవి కల్యాణ మండపంలో రెండురోజుల పాటు నిర్వహించిన తెలుగు రాష్ట్రాల ఓపెన్ చెస్ పోటీల విజేతగా ఎన్టీఆర్ జిల్లా వాసి మల్లేశ్వరరావు నిలిచారు. ఈ చెస్ పోటీల బహుమతి ప్రదానోత్సవం, ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ముఖ్యఅతిథిగా ఏపీ బిల్డింగ్–అదర్ కన్‌ష్ట్రక్షన్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఏపీ చెస్ అసోసియేషన్ కార్యదర్శి వై. సుమన్ మాట్లాడుతూ విజయవాడ సిటీలో 92 మంది అంతర్జాతీయ ఫిడే రేటింగ్ క్రీడాకారులతో కలిపి దాదాపు 400మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటారన్నారు. రుషి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ ప్రిన్సిపాల్ తాళ్లూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చెస్ నిర్వాహకులు రామకృష్ణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
విజేతలంతా నగర వాసులే..
చెస్ పోటీలు జరిగిన 7 రౌండ్లుగాను 7 పాయింట్లు సాధించి విజేతగా జె.మల్లేశ్వరరావు, 6.5 పాయింట్లు సాధించి ఉప విజేతలుగా కె. భవన్, పి.హరీష్ సాయిరామ్ మొదటి మూడు స్థానాలు సాధించారు.


