మామిడికి ఫ్రూట్ కవర్లు తప్పనిసరి
మైలవరం: మామిడి తోటలు పూత, పిందె నుంచి కాయ తయారయ్యే దశలో ఉందని, మామిడి కాయలను ఆశించే చీడ పీడల నివారణకు రైతులు అందరూ తప్పని సరిగా ఫ్రూట్ కవర్లు వాడాలని నూజివీడు మామిడి పరిశోధన స్థానం కీటక శాస్త్రవేత్త, ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ దేవమునిరెడ్డి, శాలిరాజు తెలిపారు. రెడ్డిగూడెం మండల పరిధిలోని నాగులూరు, రెడ్డికుంట, రెడ్డిగూడెం, మైలవరం మండలంలోని గ్రామాలు, జి.కొండూరు మండలంలోని గ్రామాల్లో మామిడి తోటలను మంగళవారం పరిశీలించి రైతులకు పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా దేవమునిరెడ్డి, శాలిరాజు మాట్లాడుతూ ఫ్రూట్ కవర్స్ కోసం ఉద్యాన శాఖ 15,000 కవర్లకు గాను రూ.15వేలు రాయితీ ద్వారా ఇస్తామన్నారు.
కొన్ని సూచనలు..
● తామర పురుగుల నివారణకు రైతులు నీలి, పసుపు రంగు జిగురు అట్టలు ఎకరానికి 40 నుంచి 50 చొప్పున ఏర్పాటు చేసుకోవాలని వారు తెలిపారు. బవేరియా బస్సీయానా లేదా లెకాని సిలియం లెకాని 5గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు.
● తామర పురుగుల ఉద్ధృతి అధికంగా ఉంటే సిఫార్సు చేసిన రసాయనిక మందులు (ఇమిడా క్లోప్రిడ్ 0.3 గ్రాములు లేదా థాయో మిథాక్సిమ్ 0.3 మిల్లీ లీటర్‌లు లేదా పిప్రోనిల్ 2 మిల్లీ లీటర్‌లు లేదా స్పైనోసాడ్ 03 మిల్లీ లీటర్‌లు లేదా టోల్ పైన్ రాడ్ ఉపయోగించాలన్నారు.
కొంత మంది రైతులకు పండు మునిరెడ్డి ద్వారా రాయితీ మీద సంచులు అందించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారులు పి. బాలాజీ కుమార్ ఉద్యాన సహాయకులు శ్రీహరి, అధికారులు అహ్మద్, నరేంద్ర, వేణుమాధవ్, ఎఫ్‌పీసీ సభ్యులు పాల్గొన్నారు.
ఉద్యాన శాస్త్రవేత్తలు, అధికారులు


