పెడనలో కారు బీభత్సం
పెడన: వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టి పక్కనే ఉన్న పంట బోదెలోకి దూసుకుపోయిన ఘటన పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రేపల్లె నుంచి కలిదిండి వెళ్తున్న గంట కాంతారావు(68) వయా వడ్లమన్నాడు, చేవెండ్ర, చెన్నూరు మీదుగా కారులో బయల్దేరారు. వడ్లమన్నాడు పెట్రోల్ బంకు సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదే రూట్‌లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వేమవరానికి చెందిన వారిని ఢీ కొట్టడంతో వారికి స్వల్పగాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న కారును కొందరు ద్విచక్రవాహనంపై వెంటాడటంతో కారు మరింత వేగంగా ముందుకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో చేవెండ్రపాలెం మలుపులో వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టి పక్కనే ఉన్న పంట బోదెలోకి దూసుకుపోయింది. ఆటో డ్రైవర్ తప్పించుకున్నా అందులో ప్రయాణం చేస్తున్న చేవూరుపాలెంకు చెందిన లింగవరపు సుధాకర్ ఎడమకాలికి తీవ్ర గాయమైంది. మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. కారు నడుపుతున్న కాంతారావుకు చిన్నపాటి గాయాలయ్యాయి. పెడన ఎస్‌ఐ జి.సత్యనారాయణ ఘటనా ప్రదేశాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


