ప్రారంభమైన ఏపీపీఎస్సీ పరీక్షలు
తొలిరోజు 2,056మంది అభ్యర్థులు హాజరు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో వివిధ పోస్టులకు చేపట్టిన పరీక్షలు మంగళవారం నగరంలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకూ వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి ఏపీపీఎస్సీ ఈ పరీక్షలను నిర్వహించనుంది. అందులో భాగంగా నగరంలోని వివిధ పరీక్ష కేంద్రాలను అధికారులు కేటాయించారు. జూనియర్ లెక్చరర్ (లైబ్రేరియన్ సైన్స్), ఏఈఈ (సివిల్), హార్టికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల భర్తీకి సంబంధించి 17 నోటిఫికేషన్ల ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగా వారికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలి రోజు పరీక్షలకు సంబంధించి 24 కేంద్రాలలో 5,718 మందిని కేటాయించారు. అందులో 2,056 మంది అభ్యర్థులు హాజరుకాగా, 3,662 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాలలో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ, విద్యుత్, వైద్య ఆరోగ్యం, రవాణా, పోలీస్ తదితర శాఖలు పర్యవేక్షణలలో పకడ్బందీ ఏర్పాట్లతో పరీక్షలను నిర్వహించారు.
పరీక్ష కేంద్రాల పరిశీలన..
నగరంలో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షల కేంద్రాలను మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ పరిశీలించారు. అందులో భాగంగా బిషప్ అజరయ్య కళాశాల, పటమట జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో జరుగుతున్న పరీక్ష కేంద్రాలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.


