విజయ భాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా
విజయవాడలీగల్: విజయభాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్‌పై తీర్పు గురువారానికి వాయిదా పడింది. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఐటీ శాఖా మంత్రి, వారి కుటుంబసభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలపై మాలపాటి భాస్కరరెడ్డిని అక్రమంగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో విచారణ పూర్తయింది.
ఆర్చరీ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): లాస్ ఏంజిల్స్‌లో 2028లో జరగబోయే ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని ఆర్చరీ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్ చెప్పారు. ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్–2025లో రికర్వ్ విభాగంలో బంగారు పతకం సాధించిన ఆయన బుధవారం విజయవాడలోని చెరుకూరి వోల్గా ఆర్చరీ అకాడమీని సందర్శించారు. ముందుగా తన గురువు లెనిన్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ధీరజ్ మాట్లాడుతూ ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం పొందడం తనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందన్నారు. డిసెంబర్‌లో హైదరాబాద్‌లో జరుగనున్న సీనియన్ నేషనల్ చాంపియన్‌షిప్, వచ్చే ఏడాది జనవరిలో టోక్యోలో జరగనున్న ఆసియా క్రీడలు, 2027 జరిగే ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కూడా పతకాల సాధనే లక్ష్యంగా పూర్తి స్థాయిలో సాధన చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను ఆర్చీరీ ర్యాంకింగ్‌లో భారతదేశంలో నంబర్–1 స్థానంలో, ప్రపంచంలో 13వ స్థానంలో ఉన్నానని చెప్పారు. అకాడమీ చీఫ్ కోచ్ చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఆసియా చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో కొరియా దేశానికి చెందిన క్రీడాకారులను ధీరజ్ ఓడించడం భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి వంటిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బెవర వెంకట రమణ, ఉపాధ్యక్షుడు బి.శ్రావణ్‌కుమార్, గొట్టిపాటి ప్రేమ్‌కుమార్, జాతీయ ఆర్చరీ క్రీడాకారులు చెరుకూరి డాలి శివాని, సంయుక్త తదితరులు ఽధీరజ్‌ను సత్కరించారు.
మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిఘా సంస్థ మాజీ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారికి అధికారులు స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షణ చేసిన వారు నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందచేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలు అందజేశారు.
నిత్యాన్నదాన పథకానికి విరాళాలు
పెదకాకాని: పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి బుధవారం విజయవాడకు చెందిన తిరుక్కోవల్లూరి సాంబమూర్తి పేరు మీద వారి సతీమణి శోభ రూ. 50,116 అందజేశారు. అలానే గుంటూరుకు చెందిన నందిగామ సాంబశివరావు, నర్రా రామమూర్తి, గింజుపల్లి గోపాల్‌స్వామిల పేరు మీద నందిగామ శిరీష, ప్రసాద్‌రెడ్డి దంపతులు దేవస్థాన నిత్య అన్నదాన పథకానికి రూ. 50 వేలు విరాళంగా అందజేశారు. దాతలకు ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం చేయించి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి చిత్రపటం అందజేశారు.


