బంగారు దుకాణ యజమానికి మహిళల టోకరా
తిరువూరు: పాత నగ ఇచ్చి కొత్త నగలు కొనడానికి వచ్చామని ముగ్గురు మహిళలు బురిడీ కొట్టించారు. మహిళలు వెళ్లిపోయాక నగ గిల్టుదని గ్రహించిన దుకాణ యజమాని లబోదిబోమంటూ పోలీసులు ఆశ్రయించారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో బుధవారం జరిగింది. బంగారు నగలు కొనేందుకంటూ తిరువూరులోని ఓ నగల దుకాణానికి ముగ్గురు మహిళలు వచ్చారు. గోల్ట్ కోటెడ్ బ్రాస్‌లెట్‌ను దుకాణ యజమానికి ఇచ్చారు. 88 శాతం స్వచ్ఛత చూపడం, హాల్‌మార్కు కూడా ఉండటంతో వాటిని తీసుకుని 8.5 గ్రాముల బంగారు గొలుసు, రూ.85 వేల నగదు, 40 గ్రాముల వెండి గొలుసు ఆ మహిళలు తీసుకున్నారు. వారు వెళ్లి పోయిన తర్వాత ఆ నగలను క్షుణ్ణంగా పరీక్షించగా బంగారు పూత పూసినవిగా తేలింది. దీంతో యజమాని పోలీసుల్ని ఆశ్రయించాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలుగా అనుమానించిన పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సీసీ టీవీలో రికార్డయిన మహిళల చిత్రాలను అన్ని పోలీసుస్టేషన్లకు పంపినట్లు పోలీసులు తెలిపారు.


