పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు
గూడూరు/పెడన/పమిడిముక్కల/కోనేరుసెంటర్: రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా జరిపేందుకు క్షేత్ర స్థాయిలో యంత్రాంగం పని చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే ధాన్యానికి 24 గంటలలోనే రైతు ఖాతాలో నగదు జమ చేస్తున్నామన్నారు. కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా మంత్రి బుధవారం గూడూరు, పెడన, పమిడిముక్కల మచిలీపట్నం తదితర మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డు వెంబడి ఆరబోసిన ధాన్యం రాశులను పరిశీలించారు. బందరు మండలం సుల్తానగరంలోని సీతారామాంజనేయ రైస్ మిల్లును సందర్శించారు. మిల్లు నిర్వహణ, రైతుల నుంచి ధాన్యాన్ని ఎంత ధరకు కొనుగోలు చేస్తున్నదీ ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖరీఫ్‌కు సంబంధించి ఇప్పటి వరకు 2.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లకు 16 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారన్నారు. 32,793 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించగా వారి ఖాతాలలో రూ.560 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బంది రాకుండా 6.34 కోట్ల గన్నీ సంచులు సిద్దంగా ఉంచామని వివరించారు. కౌలు కార్డు లేకున్నా ఈ పంట నమోదు చేసుకున్న కౌలు రైతుల నుంచి కూడా ధాన్యం సేకరిస్తున్నామని వెల్లడించారు. కౌలు రైతుల సంక్షేమానికి 50 వేల టార్పాలిన్ పట్టాలను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, రాష్ట్ర పౌరస రఫరాల సంస్థ వైస్ ఛైర్మన్ ఎండీ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పద్మావతి, ఆర్డీఓ స్వాతి తదితరులు పాల్గొన్నారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్


