వెట్టి చాకిరి చేయిస్తే కఠిన చర్యలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వెట్టి చాకిరి చేయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. జిల్లాలో వెట్టి చాకిరి నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వెట్టి చాకిరి నిర్మూలన కోసం జిల్లాస్థాయి నిఘా – పర్యవేక్షణ సంఘాన్ని (విజిలెన్స్ – మానిటరింగ్ కమిటీ) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుధవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో వెట్టి చాకిరి నిర్మూలనపై సమావేశం జరిగింది. లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాస్థాయి కమిటీకి కలెక్టర్ చైర్ పర్సన్‌గా, జాయింట్ కలెక్టర్ కన్వీనర్‌గా ఉంటారని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, పీడీ డీఆర్డీఏ, పీడీ డ్వామా, లీడ్ బ్యాంకు మేనేజర్, జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ, పోలీస్ శాఖల ప్రతినిధులు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, ఎస్సీ లేదా ఎస్టీ వర్గాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని చెప్పారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కమిటీకి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. ఈ కమిటీ గ్రామాలు, పట్టణాలలో వెట్టి చాకిరి బాధితులను గుర్తించి, సంబంధిత వ్యక్తులపై చర్యల కోసం జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తుందని, ఆ బాధితుల పునరావాసానికి సూచనలు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ సంఘం నోడల్ అధికారి – కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ జి.ధనలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి, డీఆర్డీఏ పీడీ నాంచారరావు, డీపీఓ లావణ్య కుమారి, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ప్రియాంక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డాక్టర్ కీర్తి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ


