సహకార రంగంలో విస్తృత అవకాశాలు
నున్న(విజయవాడరూరల్): సహకార రంగంలో విస్తృతమై అవకాశాలున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొని లాభాల దిశగా పయనించాలని జిల్లా కోపరేటివ్ అధికారి ఎస్.శ్రీనివాసరెడ్డి అన్నారు. 72వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా బుధవారం నున్న గ్రామంలో సహకార వారోత్సవాల కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సహకార బ్యాంకులు కేవలం రైతులకు వ్యవసాయ రుణాలు ఇవ్వడం వాటిని వడ్డీలతో తిరిగి చెల్లించుకోవడంతో పాటు నేడు కేంద్ర ప్రభుత్వం వైద్యం, పర్యాటక, ఓలాక్యాబ్స్, విద్యారంగం ఇలా అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టి లాభాల దిశగా తీసుకెళ్ళ వచ్చునన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి అగ్రికల్చరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ పేరుతో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిందన్నారు. అందులో భాగంగా కంప్యూటరీకరణ చేయడం జరుగుతుందన్నారు. సహకార రంగం బలోపేతం కావడానికి పాలకవర్గాల నాయకత్వం పటిష్టంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. సహకార రంగంలో రుగ్మతలను రూపుమాపి ఆర్ధిక వ్యవస్థను పెంపొందించడానికి భారతదేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ కృషి చేశారని, ఆయన పుట్టిన రోజు నవంబర్ 14 నుంచి వారం రోజుల పాటు సహకార వారోత్సవాలను జరుపుకొంటున్నామని గుర్తు చేశారు. వ్యవసాయ రుణాలను పొందటానికి వృద్ధాప్యంలో రైతులు బ్యాంకులకు రవాలని నిబంధన పెట్టారని ఆ నిబంధనలు సడలించి బ్యాంక్ ఖాతాల్లోకి ఆ మొత్తాన్ని జమ చేయాలని ఎంపీటీసీ సభ్యుడు పోలారెడ్డి ప్రసాద్‌రెడ్డి, మరి కొందరు రైతులు విజ్ఞప్తి చేశారు. రైతులకు ఆ సదుపాయం కల్గించే విధంగా చర్యలు తీసుకొంటామని చెప్పారు. సొసైటీ ఛైర్మన్ కలకోటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విభాగ సహకార అధికారి కిరణ్‌కుమార్, నున్న సొసైటీ నివేదికను వివరించారు. రాష్ట్రంలోని ముందంజలో ఉన్న సొసైటీల్లో నున్న ఒకటన్నారు. డైరెక్టర్లు గంపా శ్రీనివాసరావు, పామర్తి శ్రీనివాసరావు, అసిస్టెంట్ రిజిష్ట్రార్ ధర్మారావు, సీఈఓ టి.రమేష్‌బాబు పాల్గొన్నారు.


