సాక్షి, విజయవాడ: అక్రమ కేసులు.. వరుస అరెస్టులతో రాజకీయ కక్షలకు, తమ అవసరాలకు పోలీసు వ్యవస్థను అడ్డగోలుగా ఉపయోగించుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం.. వాళ్ల బాగోగుల విషయంలో ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోంది. బిహార్ ఎన్నికల కోసం ఇక్కడి నుంచి పంపించిన పోలీసులను ఇంకా వెనక్కి రప్పించకపోవడంతో వాళ్లు అక్కడ తీవ్ర అవస్థలు పడుతున్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల భద్రత కోసం ఇతర రాష్ట్రాల మాదిరిగానే పలువురు కానిస్టేబుల్స్‌ను ఏపీ పోలీస్‌శాఖ అక్కడికి పంపించింది. ఏపీఎస్పీ 3,5,14 బెటాలియన్ల తరఫున మొత్తం 320 మంది అక్కడికి వెళ్లారు. అయితే ఎన్నికల ప్రక్రియ ముగిసి ప్రభుత్వం ఏర్పాటు అయినా కూడా .. వాళ్లను వెనక్కి రప్పించే ప్రయత్నాలేవీ హోం శాఖ చేసినట్లు కనిపించడం లేదు.
ఎలక్షన్ డ్యూటీల సమయంలో సరైన సదుపాయాలు.. ఆహారం లేక పోలీసు సిబ్బంది ఎలాంటి అవస్థలు పడతారో తెలిసిందే. అయితే వారం గడుస్తున్నా ఆ అవస్థలు కొనసాగుతుండడంపై వాళ్లంతా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సిబ్బంది అక్కడి ఉన్నతాధికారులు ఎన్నికలవ్వగానే వెనక్కి రప్పించగలిగారని.. అలాగే తమను వెంటనే వెనక్కి రప్పించాలని హోం మంత్రి అనితను వాళ్లు కోరుకుంటున్నారు.


